Share News

ఫర్నిచర్‌ షాపు దగ్ధం

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:54 AM

ఏలూరు సమీపంలోని ఫర్నిచర్‌ షాపు కమ్‌ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సంభవించింది.

ఫర్నిచర్‌ షాపు దగ్ధం
దగ్ధమవుతున్న ఫర్నిచర్‌ షాపు

ఏలూరు సమీపంలో అగ్ని ప్రమాదం

రూ. కోటి ఆస్తి నష్టం

ఏలూరు క్రైం, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఏలూరు సమీపంలోని ఫర్నిచర్‌ షాపు కమ్‌ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సంభవించింది. కోటి రూపాయలపైన ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. బీడీ కాలనీకి చెందిన మాడా బత్తుల వెంకటేష్‌ జంగారెడ్డిగూడెం రోడ్డులోని జేఎంజే స్కూలు సమీపంలో గణేష్‌ సోఫాస్‌ అండ్‌ ఫర్నిచర్‌ వర్క్స్‌ పేరుతో షాపు నిర్వహిస్తున్నారు. అక్కడే గోడౌన్‌ సోఫాసెట్ల తయారీ, మరమ్మతు లను చేస్తున్నారు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అక్కడ దట్టమైన పొగ వ్యాపించి మంటలు చెలరేగాయి. సమీపంలోని దుకాణదారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే ఫర్నిచర్‌కు మంటలు వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. తొలుత ఒక ఫైర్‌ ఇంజన్‌ వచ్చి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో మరో రెండు ఫైర్‌ ఇంజన్లు తీసుకువచ్చారు. రాత్రి 9.30 గంటల వరకూ మంటలను అదుపు చేస్తూనే ఉన్నారు. జిల్లా అదనపు అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ పరిస్థితిని పర్యవేక్షించారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందా లేదా వెల్డింగ్‌్‌ పనులతో నిప్పు రవ్వలు ఫర్నిచర్‌ మెటీరియల్‌పై పడి మంటలు అంటుకున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు కోటి రూపాయలు పైనే నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం మార్గంలో తంగెళ్ళమూడి దాటిన తరువాత జరిగిన అగ్ని ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఏలూరు వన్‌టౌన్‌ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Updated Date - Jun 06 , 2025 | 12:54 AM