Share News

విజృంభిస్తున్న జ్వరాలు

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:00 AM

వర్షాకాలం.. అల్పపీడనం.. మబ్బులు.. ముసురు.. ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఇంకో వైపు వేసవిని తలపించే ఎండలు.. భిన్న వాతావరణంతో ప్రజలు సతమతం అవుతున్నారు.

విజృంభిస్తున్న జ్వరాలు
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు

ఒక పక్క వర్షాలు.. మరోవైపు ఎండ

ఉమ్మడి జిల్లాలో జ్వరాల వ్యాప్తి

వైరల్‌ ఫీవర్‌తోపాటు డెంగీ, టైఫాయిడ్‌

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల రద్దీ

గ్రామాల్లో మందులతో సరి

ఎక్కడికక్కడ పారిశుధ్యం అధ్వానం

దోమల వ్యాప్తి.. పెరుగుతున్న రోగాలు

వర్షాకాలం.. అల్పపీడనం.. మబ్బులు.. ముసురు.. ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఇంకో వైపు వేసవిని తలపించే ఎండలు.. భిన్న వాతావరణంతో ప్రజలు సతమతం అవుతున్నారు. సాధారణంగా జూన్‌ మూడో వారం నుంచి అక్టోబరు రెండో వారం వరకూ వర్షాకాలం. పర్యావరణ సమతుల్యం దెబ్బ తినడంతో భిన్న పరిస్థితుల్లో విభిన్న సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుత వాతారణంలో ఉమ్మడి జిల్లాలో జ్వరాలు విజృంభించాయి. వారం రోజుల నుంచి ఆసుపత్రులకు వచ్చే వారిలో 30 శాతం మంది జ్వర బాధితులే. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 1200 ఓపీ పేషెంట్లు వస్తుండగా 400 మంది జ్వర బాధితులే వస్తున్నారు.

ఏలూరు క్రైం/పాలకొల్లు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యో తి): భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్‌ జ్వరాలతో పాటు డెంగీ, టైఫాయిడ్‌, సీజనల్‌ జ్వరాలతో ప్రజలు బాధ పడుతున్నారు. ప్రధానంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు, కూర్చుంటే లేవలేని పరిస్థితి, చలి కుదుపు, జ్వరం, తలనొప్పి, జలుబు తదితర లక్షణాలతో ప్రజలు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు నిత్యం ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. రోజుకు రెండు వేల మంది పైగానే జ్వర బాధితులు ఆస్పత్రు ల్లో వైద్యం పొందుతున్నారని తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేక గ్రామాల్లో ఉన్న ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకుని మింగుతున్నారు.

ఏదో మందులు మింగుతున్నారు

ఈ పూట జ్వరం తగ్గిపోతుందని ఆత్మస్థైర్యం పెంచుకుంటూ గుక్కెడు గంజి, బొక్కెడు జావ లేదా గ్లాసుడు కాఫీ, టీయో తాగి కొంత శక్తిని కూడగట్టుకుం టున్నారు. నిన్నటి వరకూ పొలం పనుల్లో ఎద్దుల్లాగ పనిచేసిన తాము జ్వరంతో శక్తిని కోల్పోయి గ్లాసు మంచి నీళ్లు తాగే ఓపిక కూడా లేని పరిస్థితుల్లో ఉన్నామని కొందరు భయపడుతున్నారు.

వైద్య పరీక్షలు నామమాత్రం

వైద్య ఆరోగ్యశాఖ తరపున ప్రతి గ్రామంలో మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యు మేల్‌/ఫిమేల్‌) పని చేస్తున్నారు. జ్వర బాధితుల నుంచి రక్తం సేక రించి పరీక్షలకు పంపాల్సి ఉండగా నామమాత్రంగానే జరుగుతున్నాయి. ఏలూరు ఆసుపత్రిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాధారణ రక్త పరీక్షలు చేస్తున్నారే తప్ప డెంగీ పరీక్షలు చేయడం లేదు. దీంతో రోగిలోని డెంగ్యూ జ్వరం రోజురోజుకు పెరిగిపోతుంది. చివరకు ఇక్కడ పరీక్షలు చేయడం లేదని రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. వాస్తవానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డెంగీ నిర్ధారణ చేసే ఖరీదైన వైద్య యంత్ర పరికరం ఉంది. మిగిలిన అన్ని ల్యాబ్‌ల్లో కేవలం ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా మాత్రమే డెంగీ నిర్ధారణ చేస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆ యంత్ర పరికరం ఉన్నప్పటికి ప్రజలకు అందుబాటులో లేదనే విమర్శలు ఉన్నాయి.

పడకేసిన పారిశుధ్యం

గ్రామీణ ప్రాంతాల్లో మురుగు, డ్రెయిన్లు శుభ్రప ర్చకపోవడంతో ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి దోమ లు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. కనీసం మురుగు, వీధులలో కూడా బ్లీచింగ్‌ వేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు ఇబ్బందులకు గురవు తున్నారు. ఏలూరు నగరంలో కూడా డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నా కనీసం బ్లీచింగ్‌ వేయడం లేదు. ఆ డ్రైయిన్‌ను పరిశుభ్రం చేయడం లేదు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. దోమల నివారణకు డ్రైయిన్లలో రసాయనాలను పిచికారి చేయాల్సి ఉన్నా అది జరగడం లేదు. ఇంక ఏలూరు నగరంలో అయితే దోమల నివారణకు ఫాగింగ్‌ చేయాల్సి ఉన్నా ఎక్కడా చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో రోజు రోజుకు దోమలు పెరిగి దోమ కాటుకుగురై జ్వరబారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే జిల్లాలోని ప్రజలు అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.

పరిశుభ్రత పాటించాలి

ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోరువెచ్చటి నీటిని తీసుకోవాలి. చేపలు, మాంసాహారం తగ్గించుకోవడం మంచి ది. ఒళ్లునొప్పులు, తలనొప్పి, జలుబు, కీళ్ల నొప్పు లు, చలి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించా లి. వైద్యుల సూచనతో మందులను వాడాలి.

– తోకల సికింద్ర మోహన్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, వైద్య కళాశాల, ఏలూరు

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం

ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్య సేవలం దుతున్నాయి. గ్రామాల్లో టైఫాయిడ్‌, మలేరియా జ్వరాలున్నాయి. పంచాయతీ అధికారులతో కలసి గ్రామాలలో పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.

– డాక్టర్‌ రాజశేఖర్‌, లింగపాలెం పీహెచ్‌సీ

వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌

వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌ బాధితులు ఆసుపత్రికి ఎక్కువగా వస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాచి చల్లార్చిన నీరు తాగడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

– డాక్టర్‌ యజ్ఞ వర్మ, పాలకొల్లు

Updated Date - Sep 09 , 2025 | 12:00 AM