పండగ ఇళ్లు
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:39 AM
పండుగ నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించేందకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. మిగిలిన నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచిది.
జనవరి, మార్చిలో పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని లక్ష్యం
భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో ఊపందుకున్న పనులు
భీమవరంటౌన్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): పండుగ నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించేందకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. మిగిలిన నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచిది. రెండు రోజుల క్రితం టిడ్కో ఎండీ జిల్లాలో నిర్మాణ పనులు పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో వచ్చేనెల 15 లోపు, భీమవరం, పాలకొల్లు ఇళ్లను మార్చి 31లోపు పూర్తి చెయ్యాలని నిర్మాణ ఏజెన్సీలకు గడువు విధించారు.
జిల్లాలోని మూడు పట్టణాల్లో క్షేత్రస్థాయిలో టిడ్కో ఇళ్లను ఎండీ కె.సునీల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆయన పర్యటన అనంతరం సీవరేజ్ ట్రిట్‌మెంట్ ప్లాంట్‌లను పూర్తిచేసే పనిలో ఉన్నారు. మరోవైపు టిడ్కో ఇళ్ల అంతర్గత పనులను పూర్తి చేసేలా ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే తొలివిడతగా భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నిర్మాణాలు తుది దశకు చేరుకోగా ప్రభుత్వం మార డంతో తర్వాత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పూర్తయిన ఇళ్లను అప్పగిం చడంలో కూడా జాప్యం చేసింది.. బ్యాంకు రుణాలు వంజూరుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రతిబంధకాలను అధిగమించి ఇళ్లు అప్పగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయడంతో ఏజెన్సీలు కూడా పనులను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సిందే..
జిల్లాలో టిడ్కో గృహ లబ్ధిదారులకు ప్రైవేట్ బ్యాంకులు రుణాలు మంజూరు చెయ్యడంలేదు. ఒక్కొక్క ఇంటికి చదరపు అడుగులను బట్టి రూ.3.15 లక్షల నుంచి రూ 3.30 లక్షల వరకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో దాదాపు 4వేల మందికి ఇప్పటి వరకు రుణాలు కల్పించలేదు. రుణాల మంజూరుపై కలెక్టర్ నాగరాణి పలు పర్యాయాలు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించారు. రుణాల మంజూరు బాధ్యతను అప్పట్లో మెప్మాకు అప్పగించారు. మెప్మాలోని స్వయం సహాయక సంఘాల్లోని వారికి ఇళ్లు మంజూరైతే వాణిజ్య బ్యాంకుల్లో రుణం రానివారికి మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్నారు. ప్రైవేటు బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించి రుణ మంజూరుకు చర్యలు చేపడుతున్నారు.
తాడేపల్లిగూడెంలో సంక్రాంతికి..
తాడేపల్లిగూడెంలో 5376 టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు 4256 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. మిగిలిన 1120 ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసి వచ్చే నెల 15 లోపు లబ్దిదారులకు సంక్రాంతి కానుకగా అందించాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు.
భీమవరం, పాలకొల్లులో ఉగాదికి..
భీమవరంలో టిడ్కో ఇళ్లను మార్చిలోగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. వాస్తవంగా 8352 ఇళ్లు లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 1984 ఇళ్లను మాత్రమే అందించారు. 6368 ఇళ్లను అప్పగించాల్సి ఉంది. ఎస్‌టీపీ నిర్మాణం వెనకబడడంతో కొంత జాప్యం జరిగింది. పాలకొల్లులో 6144 ఇళ్లకు 2592 ప్లాట్లు అందించారు.ఇంకా 3552 నిర్మించాల్సి ఉంది. మార్చికి అందించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎట్టకేటకు ఎస్‌టిపి నిర్మాణం పూర్తి
భీమవరంలో టిడ్కో ఇళ్ళతోపాటు దాదాపు 7 ఏళ్ల తరువాత 5ఎంఎల్‌డి సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ) నిర్మాణం పూర్తి చేసుకుంది. దాదాపు రూ9.50 కోట్లతో నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్ రన్ పూర్తిచేశారు. మరోసారి ట్రయల్ రన్ అనంతరం జనవరి నెలాఖారులోగా వినియోగంలోకీ తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉంటున్న లబ్ధిదారులు, రాబోయే లబ్ధిదారులకు మురుగు సమస్య తీరనుంది. కాలనీపైపులైన్ ఎస్‌టీపీకి అనుసంధానం చేయాల్సి ఉంది.