ప్రజల జీవితాలకు నమ్మకం కలిగించాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:22 AM
ప్రజల జీవితాలకు నమ్మకం కలిగించడం పోలీసుల బాధ్యత అని కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు.
ప్రజల జీవితాలకు నమ్మకం కలిగించాలి
కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్
వీరవాసరం (భీమవరం టౌన్), అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రజల జీవితాలకు నమ్మకం కలిగించడం పోలీసుల బాధ్యత అని కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో జన్మించి, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి అత్యున్నత పదవిలో పనిచేస్తున్న రావాడ ఆజాద్ చంద్ర శేఖర్‌కు వీరవాసరం గ్రామ ప్రజలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, కేరళ రాష్ట్రం డీజీపీగా ఎదగడానికి ప్రధాన కారణం గురువులు, ఊరి ప్రజల ఆశీస్సులే కారణం అన్నారు. తాను సాధారణ విద్యార్థినని, ఐపీఎస్ సాధించడంలో యోగ్యత, యోగం కూడా కలిసి ఉన్నాయన్నారు. యోగ్యత ఉంటే యోగం భగవంతుడు చూపిస్తాడని వ్యాఖ్యా నించారు. పొలం పనులు కూడా చేశానని, విద్యార్థులు గురువుల ఉపదేశాలు, మార్గదర్శకంలో ఎంతో సాధించగలరన్నారు. ఇంటర్నెట్‌కు పిల్లలు బానిసలు కాకూడదని, సరైన మార్గంలో వాడుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేరళ డీజీపీగా చంద్రశేఖర్ పశ్చిమగోదావరి జిల్లావాసి కావడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. ఎమ్మెల్యే పునపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని వ్యక్తి ఒక రాష్ట్రానికి డీపీజీ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం రావాడ చంద్రశేఖర్ దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్జి వీరవల్లి గోపాలకృష్ణ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డిప్యూటీ కలెక్టర్ పద్మ, సర్పంచ్ చికిలే మంగతాయరు తదితరులు పాల్గొన్నారు.