Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఎవరికి ఇవ్వాలి..!

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:26 AM

కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీజు బకాయిలను ఎవరి ఖాతాలో వేయాలనే విషయంపై ఆరా తీస్తోంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఎవరికి ఇవ్వాలి..!

వైసీపీ హయాంలో బకాయిలపై ఆరా

ఇప్పటికే విద్యార్థులు చెల్లిస్తే తల్లిదండ్రుల ఖాతాలో జమ

లేకుంటే కళాశాలల ఖాతాలకు చెల్లింపు

వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం

సచివాలయాలకు మార్గదర్శకాలు

మొత్తం బకాయి రూ.15ం కోట్లు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న కళాశాలలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీజు బకాయిలను ఎవరి ఖాతాలో వేయాలనే విషయంపై ఆరా తీస్తోంది. సచివాల యాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు ఇది వరకే కళాశాలలకు చెల్లించినట్టయితే వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్నారు. ఫీజు చెల్లించకపోతే కళాశాలల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ప్రభుత్వంలో మూడు విడతల బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎన్నికల ముందు ఏడాది మూడు నెలల ఫీజును మాత్రమే నాటి ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసింది. మరో మూడు విడతలు బకాయి పెట్టింది. మొత్తం కలిపి అప్పట్లోనే రూ. 75 కోట్లు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాలలకు ఫీజులను పెంచింది. వైసీపీ హయాంలో కక్ష పూరితంగా నిలిపివేసిన కళాశాలలకు మాత్రం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా న్యాయం జరగలేదు. జిల్లాలో ఇలా రెండు ఇంజనీరింగ్‌ కళాశాలలకు అన్యాయం జరిగింది. మిగిలిన ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఫీజు పెరిగింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనూ ఏడాది విద్యా సంవత్సరం పూర్తయ్యింది. పెంచిన ఫీజులతో కలిపి ప్రతి మూడు నెలలకు జిల్లాలో రూ.30 కోట్లు చెల్లించాలి. ఏడాదికి రూ. 120 కోట్లు జమ చేయాలి. ఒక్క విడతకు మాత్రం పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేశారు. రెండో విడతలో 50శాతం మాత్రం చెల్లించారు.

కళాశాలల ఖాతాకే..

ప్రస్తుత ప్రభుత్వం కళాశాలల ఖాతాలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తోంది. తద్వారా విద్యార్థులకు కూడా ఇబ్బందులు తొలగి పోయాయి. ప్రభుత్వం ఫీజు విడుదల చేయకపోతే విద్యార్థులే కళా శాలలకు చెల్లించేవారు. లేదంటే సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా కళాశాల లు ఫీజులు వసూలు చేసేందుకు మల్లగుల్లాలు పడేవి. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు సర్టిఫికెట్‌లు తీసుకోవాలన్నా.. ఉన్నత చదు వులకు వెళ్లాలన్నా అప్పు చేసి ఫీజులు చెల్లించేవారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కళాశాల ఖాతాల్లో జమ చేస్తోంది, దీనివల్ల బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములు తెచ్చు కుని కశాలలకు చెల్లించే ఇబ్బందులను విద్యార్థులు అధిగమిం చారు. సర్టిఫికెట్‌ల విషయంలో విద్యార్థులకు అవరోధాలు కల్పించ వద్దంటూ కూటమి ప్రభుత్వం కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది.

బకాయిల కోసం ఎదురుచూపులు

గత ప్రభుత్వంలో దాదాపు రూ.75 కోట్లు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం ఫీజులు పెంచడంతో మూడు విడతల బకాయిలను మరో రూ. 75 కోట్లు జమ చేయాలి. జిల్లాలో పాత, కొత్త బకా యిలు మొత్తం రూ.150 కోట్లు విడుదల చేయాలి. కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తారన్న సానుకూల నిర్ణయం తీసుకోవడంతో యాజమాన్యాలకు ఊరట కలిగింది. విద్యార్థుల అవస్థలు తొలగిపోయాయి. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకు పోవడంతో యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అప్పులు తెచ్చి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సొమ్ము విడుదల చేస్తుందని ఎదురు చూస్తున్నారు. గత బకాయిలపై వివరాలు సేకరిస్తున్నారు. వాటిని విడుదల చేయాలంటే కాలాతీతం అవు తోంది. అటు విద్యార్థులు, ఇటు కళాశాలల నుంచి వివరాలు సేక రించాలి. అప్పటి వరకు బకాయిలు పెండింగ్‌లో ఉంటాయి. లెక్క తేలిన తర్వాతే ఎవరి ఖాతాలో జమ చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఫీజు చెల్లించినట్టయితే తల్లిదండ్రులు ఖాతాలో, చెల్లించని విద్యార్థులకు సంబంధించి కళాశాలల ఖాతాలో బకాయిలను జమ చేస్తుంది. అప్పటిదాకా ప్రస్తుత ప్రభుత్వంలో బకాయిలను చెల్లిస్తే ఆర్థికంగా కాస్త వెసులు బాటు ఉంటుందని యాజమాన్యాలు ఆశిస్తున్నాయి. కళాశాలల ఖాతాలో జమ కానుం డడంతో విద్యార్థుల నుంచి వసూలు చేసే పరిస్థితి లేదు. దాంతో ప్రభుత్వంపైనే ఇప్పుడు కళాశాలలు ఆధారపడుతున్నాయి.

Updated Date - Jun 05 , 2025 | 12:26 AM