అన్నదాత.. ఆనందం
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:25 AM
ధాన్యం అమ్మిన గంటల వ్యవధిలో ఖాతాల్లో సొమ్ములు జమవుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం సొమ్ముల కోసం ఎదురుచూసే పరిస్థితి వుండేది.
(తాడేపల్లిగూడెం రూరల్–ఆంధ్రజ్యోతి):
ధాన్యం అమ్మిన గంటల వ్యవధిలో ఖాతాల్లో సొమ్ములు జమవుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం సొమ్ముల కోసం ఎదురుచూసే పరిస్థితి వుండేది. కూటమి సర్కార్ రాకతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఓ వైపు పంట పెట్టుబడి, మరో పక్క అప్పులు తీర్చుకునేందుకు ఎదురుచూసే రైతులకు ఈ పరిణామంతో ఆనందోత్సాహాల్లో మునిగారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరానికి చెందిన ఐదుగురు రైతులు ధాన్యం తూయగా గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. పెదతాడేపల్లి కొనుగోలు కేంద్రంలో విక్రయిం చిన రైతులకు 12 గంటల్లోనే జమయ్యాయి.
లక్ష్యం నాలుగు లక్షల టన్నులు
జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 200 టన్నుల కొనుగోలు చేశారు. రైతులందరికి జమ చేసేందుకు సొమ్ములు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రూ.20 కోట్ల వరకూ మిల్లర్లకు అందించారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2,300 కనీస మద్దతు ధర అందించేందుకు తేమ 17 శాతం కనిష్టంగా ఉండాలని స్పష్టం చేసింది.
రైతుల ఆనందానికి అవధులు లేవు
మా సంఘం ద్వారా మాధవరంలో ఐదుగురు రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూశారు. 36 గంటలు దాటక ముందే వారి ఖాతాల్లో సొమ్ములు జమయ్యాయి. ఈ కారణంగా రైతు లు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేం దుకు సుముఖత చూపిస్తున్నారు.
– కొండపల్లి నగేష్, కృషి అమృత భారత్ ఫార్మర్ ప్రొడ్యూస్ సంఘ అధ్యక్షుడు
రైతు ప్రభుత్వం అని చెప్పడానికి ఈ నిదర్శనం చాలు. గతంలో నెలల తర బడి ధాన్యం సొమ్ముల కోసం రైతులు ఎదురుచూసేవారు. కాని, రాష్ట్రం ఆర్థి కంగా ఇబ్బందుల్లో ఉన్నా మొదట రైతుల సొమ్ములు వేశాకే మిగిలిన వాటికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనిస్తున్నాం.
– నార్పిరెడ్డి దొరబాబు, రైతు, అప్పారావుపేట
తాడేపల్లిగూడెం మండలంలో 1300 టన్నులు కొనుగోలు చేశాం. వాటిలో 90 శాతం వరకూ సొమ్ములు రైతుల ఖాతాలకు జమయ్యాయి. రెండు రోజుల్లో కొనుగోళ్లు మరింత ఊపందుకోనున్నాయి.
– వి.నారాయణరావు, మండల వ్యవసాయాధికారి