ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:16 AM
తణుకు పట్టణంలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్ట యింది. నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని మంగళవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
తణుకులో ఐదుగురి అరెస్ట్
తణుకు, జూన్ 3(ఆంధ్రజ్యోతి) : తణుకు పట్టణంలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్ట యింది. నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని మంగళవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. తణుకు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో సీడీఎం మెషిన్‌లో జమ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాలకొల్లు మండలం ఉల్లంపర్రుకు చెందిన అడబాల ఆంజనేయ మూర్తి, పోడూరు మండలం జిన్నూరుకు చెందిన జుత్తిగ నాగరాజు, యలమంచిలి మండలం కాజగ్రామానికి చెందిన దిగుమర్తి ఏసు, భీమవరం మండలం యల్లమెల్లిపురం గ్రామానికి చెందిన తోట రామచంద్రరావు, తణుకు ఎన్జీవో కాలనీకు చెందిన పినిశెట్టి చక్రధర్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ. 1,67,600 విలువైన రూ.200 నోట్లు 838 స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇదే కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. తణుకు ఎన్టీవోకాలనీకి చెందిన పినిశెట్టి చక్రధర్ గత నెల 15న స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సీడీఎం ద్వారా తన ఖాతాలోకి 200నోట్లు మొత్తం రూ.16,600 నగదును జమ చేశాడు. ఆ నగదు జమ కాకపోవడంతో అదే నెల 21న బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు బ్రాంచి మేనేజర్ విరోతి సోమశేఖర్‌తో కలిసి సిబ్బంది మెషిన్ తెరచి చూడగా జమ చేసేందుకు ప్రయత్నిం చిన 83 నోట్లు జమ కాకపోగా అక్కడే ఇరుక్కున్నాయి. అనుమానం వచ్చి పరిశీలిం చగా నకిలీ కరెన్సీ అని తేలడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ కొండయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ కె.ప్రసాదు బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. కేసులో నిందితులను అరెస్టు చేయడానికి సహకరించిన సీఐ కొండయ్య, ఎస్‌ఐ ప్రసాదు, ఏఎస్‌ఐ పోలయ్యకాపు, హెడ్ కానిస్టేబుల్ ఎంవీవీ సత్యనారాయణ, కాని స్టేబుల్స్ అప్పారావు, శివాజీ, మోహన మురళీకృష్ణలను అభినందించారు. వీరికి జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీంఅస్మి రివార్డులను అందజేశామన్నారు. ట్ర్తెనీ డీఎస్పీ కె.మానస తదితరులు పాల్గొన్నారు.