ముఖం చాటేశారా.. తప్పించుకోలేరు!
ABN , Publish Date - May 06 , 2025 | 12:20 AM
వైద్య శాఖలో హాజరు నమోదులో అవకతవకలు వెలుగు చూశాయి.
హెల్త్ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ హాజరు నమోదులో అవకతవకలు
ఉమ్మడి జిల్లాలో 11 మంది
వైద్య సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు
8 మంది పీహెచ్‌సీ వైద్యాధికారులే!
ఫోన్ సెట్టింగ్స్‌తో టాంపరింగ్
వారిపై కఠిన చర్యలు
ఏలూరు అర్బన్, మే 5 (ఆంధ్రజ్యోతి): వైద్య శాఖలో హాజరు నమోదులో అవకతవకలు వెలుగు చూశాయి. వైద్యాధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న ముఖ గుర్తింపు ఆధారిత(ఎఫ్‌ఆర్‌ఎస్) హెల్త్ యాప్‌లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేశారనే అభియోగాలపై ఉమ్మడి పశ్చిమలో 11 మందిపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సోమ వారం ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారు లు 8మంది, ఒక ఎంఎల్‌హెచ్‌పీ, ఒక గ్రేడ్–2 ఫార్మసిస్టు, ఒక గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. ప్రతీరోజు ఉదయం వారికి కేటాయించిన కార్యస్థానాల్లో పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాల్సివస్తే వివరాలను నిర్ణీత బుక్‌లో నమోదు చేస్తే పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరిస్తారు. దీనికి భిన్నంగా కొందరు పీహెచ్‌సీ ప్రధాన కార్యస్థానాలకు వెళ్లకుండా, అనుబంధ సబ్ సెంటర్లను మ్యాపింగ్ చేసు కోవడం, ఆ ప్రాంతంలోకి రాగానే హాజరు నమోదు చేసుకుని వెళ్లిపోతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
గతనెల 10న ఎఫ్‌ఆర్‌ఎస్ స్టేట్ నోడల్ ఆఫీసర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో ముఖగుర్తింపు ఆధారిత హాజరు నమోదు పరిశీలించారు. పలు పీహెచ్‌సీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు ఐఫోన్ల ద్వారా డేట్, టైం సెట్టింగ్‌లను ట్యాంపరింగ్ చేసి తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నట్టు గుర్తించారు. తప్పుడు మార్గంలో హాజరు నమోదు చేయడం ద్వారా తమ కార్యస్థానాలకు హాజరుకావడంలో కొందరు బురిడీ కొట్టిస్తున్నట్టు గమనించారు. యాప్‌లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారని సర్వీస్ ప్రొవైడర్ అందజేసిన వివరాలతో నిర్ధారణకు వచ్చారు. ఇలా ఒకటి నుంచి గరిష్ఠంగా మూడు దఫాలు ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు తేల్చారు. దీంతో గత నెలలోనే సంబంధిత ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ, ఆ వెంటనే వివరణ ఇవ్వడం జరిగిపోయాయి. హాజరు నమోదులో మాల్‌ప్రాక్టీస్ విధానాలకు చెక్‌పెట్టాలని నిర్ణయించిన ఉన్నతాధికా రులు తాజాగా కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ఎల్‌ఎన్‌డీ పేట, ముదినేపల్లి, పీఆర్.గూడెం, పూళ్ల, రాఘవాపురం, తాడువాయి, పెనుగొండ, మార్టేరు పీ హెచ్‌సీల్లో కొందరు వైద్యాధికారులతో పాటు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మాసిస్టు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్(హెచ్‌డబ్ల్యుసీ)లో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)లపై తదుపరి చర్యలకు ఆదేశించారు. వీరిలో రెగ్యులర్‌ప్రాతిపదికన పనిచేసేవారిపై సీసీఏ రూల్స్‌ప్రకారం క్రమశిక్షణచర్యలు, కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేవారిని విదులనుంచి తొలగించి, ఆ సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశించారు.
విధుల నుంచి తొలగించారు..?
హాజరులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రా క్టు/ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను విధులనుంచి తొలగిస్తూ జిల్లా అధికారి ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. మిగతావారిపై చర్యలకు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కఠినచర్యలు తీసుకోకుండా ఉన్నత స్థాయిలో పైరవీలు, లాబీయింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం. తొలి తప్పుగా పరిగణించి వదిలేయాలని, ఇకమీదట ఇలా జరుగబోదని పలువురు తమ ప్రయ త్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల ఆదేశాలు అందాయి..
హాజరు ట్యాంపరింగ్‌పై చర్యలకు ఉన్నతాధికుల నుంచి ఆదేశాలు అందాయి. వాటిని ఇంకా చదవలేదు. పూర్తి వివరాలు తెలీదు. జిల్లాకు చెందిన వారెవరైనా ఉన్నారనే దానిపై కార్యాలయ సెక్షన్ సిబ్బంది నుంచి వివరాలను తీసుకుంటా.
– డాక్టర్ మాలిని, జిల్లా వైద్యాధికారి