పరీక్ష సెంటర్ మార్పు దుర్మార్గం
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:43 PM
ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష సెంటర్‌ను మార్పు చేయడం దుర్మార్గమని, తక్షణమే న్యాయం చేయాలని ఎయిడెడ్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు డిమాండ్ చేశారు.
పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాల వద్ద నిరసన తెలిపిన అభ్యర్థులు
పెనుగొండ,జూలై 27(ఆంధ్రజ్యోతి): ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష సెంటర్‌ను మార్పు చేయడం దుర్మార్గమని, తక్షణమే న్యాయం చేయాలని ఎయిడెడ్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. పెనుగొండ ఎస్‌వీకేపీ సైన్స్ జూనియర్ కళాశాలలో ఆదివారం జరగాల్సిన ఏడు ఎయిడెడ్ పోస్టుల భర్తీ పరీక్షను నిలిపి వేయడంతో అభ్యర్థులు ఆందోళన చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈసెంటర్‌కు 20 మంది పరీక్షను రాసేందుకు అభ్యర్థులు పెనుగొండ సెంటర్‌కు వచ్చారు. ఇక్కడకు వచ్చని అభ్యర్థులకు పరీక్ష సెంటర్ ఇక్కడ కాదని తాడేపల్లిగూడెం, భీమవరం సెంటర్లకు మార్పు చేశామని చెప్పడంతో అభ్యర్థులు అవాక్కయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు మార్పు చేశామని చెప్పడం ఏమిటని సెంటర్ వద్ద కొంతసేపు నిరసన తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి పేపర్ ప్రకటన ఇచ్చామని, ఆదివారం ఉదయం వచ్చిందని చెప్పడంతో అప్పటికపుడు ప్రకటన చేయడం ఏమిటని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ వద్ద అభ్యర్థుల హాల్ టిక్కెట్లతో కూడిన బోర్డును ఏర్పాటు చేశారు. పరీక్షను వాయిదా వేశామని ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, మరో రెండు చోట్ల పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. ఎయిడెడ్ పోస్టులకు కాంట్రాక్టుగా చేసిన తరువాత పర్మినెంట్ చేస్తామని కాల్ లెటర్‌లో పేర్కొన్నారని, ఎంతో కష్టపడి చదివి పరీక్షకు వస్తే ఈ విధంగా మార్పు చేయడం తగదని పైగా తాడేపల్లిగూడెం, భీమవరం సెంటర్‌లలో ఉదయం 9.30 గంటలకే పరీక్ష నిర్వహిస్తే ఏవిధంగా సెంటర్‌లకు వెళ్లి రాయడం సాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరీక్ష సెంటర్ మార్పు పలు అనుమానాలకు తావిస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలేజీకి చేరని సమాచారం
పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే ఎయిడెడ్ పరీక్షలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందకపోవడం విడ్డూరంగా మారింది. ఈమేరకు పరీక్షా కేంద్రంలో యథావిధిగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులలో కొందరు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో దీనికి అనుగుణంగా మూడుస్లాట్‌లలో పరీక్షలు ఏర్పాట్లు చేశారు. పరీక్షా సమయం కావస్తున్నా విద్యాశాఖాధికారులు రాకపోవడంతో అనుమానం వచ్చి సంప్రదిస్తే పరీక్షా కేంద్రం మార్పు చేసినట్టు చెప్పారు. అప్పటికే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరడంతో వారు డీలా పడిపోయారు. ముందస్తు సమాచారం అందించకుండా మార్పు ఎలా చేశారంటూ నిరసన తెలిపారు.
పరీక్ష రాసే అవకాశం పోయింది
ఏలూరు నుంచి ఉదయాన్నే ఇక్కడకు వచ్చాను. ఎయిడెడ్ పోస్టుకు కాంట్రాక్ట్‌గా చేసిన తరువాత పర్మినెంట్ చేస్తామని కాల్ లెటర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరీక్ష కోసం ఎంతో కష్టపడి చదివా.. కాని పరీక్షను రాయనీయలేదు. మోసం చేశారు. ఉద్యోగాలు రాకుండా కావాలని చేశారు.
– దాసరి పద్మావతి, ఏలూరు.
ఇది దుర్మార్గం.. న్యాయం చేయాలి
మాకిచ్చిన కాల్ లెటర్‌లో పరీక్ష సమయం మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు సమయం పేర్కొన్నారు. ఒక గంట ముందుగా పరీక్షా హాలు వద్దకు వచ్చినప్పటికి ఎవ రూ స్పందించలేదు. ్ఞ్ఞఅప్పటికప్పుడు తాడేపల్లిగూడెం వెళ్లి రాయాలంటే ఎలా సాధ్యం. కాల్ లెటర్‌లో ఉన్న సమాచారంతో అధికారులు ముందస్తుగా సెంటర్ మార్పు తెలియజేస్తే బాగుండేది. ఇది దుర్మార్గం. అధికారులు న్యాయం చేయాలి.
– జి. శైలజ, పెంటపాడు