Share News

క్షణ క్షణం ఉత్కంఠ!

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:37 AM

ఏలూరులో మంగళవారం ఉదయం మావోయిస్టుల అరెస్ట్‌ నుంచి బుధవారం రాత్రి ఏడు గంటలకు వారిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించే వరకు అడుగడుగునా క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది.

క్షణ క్షణం ఉత్కంఠ!
మావోయిస్టులను బస్సులో కోర్టుకు తరలిస్తున్న పోలీసులు

పోలీసులు ఇబ్బంది పెట్టారా ? శరీరంపై గాయాలు వున్నాయా ?.. మావోయిస్టులను ప్రశ్నించిన మేజిస్ర్టేట్‌ మేరీ

గోండు భాషలో సమాధానం..

తర్జుమా చేసిన కుక్కునూరు ఆదివాసీలు

వారికి ఆధార్‌ కార్డులు లేకపోవడంతో మధ్యవర్తుల సమక్షంలో పంచనామా

మూడో తేదీ వరకు రిమాండ్‌..

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

అరెస్టు నుంచి కోర్టుకు హాజరు పరిచే

వరకు పర్యవేక్షించిన ఎస్పీ కిశోర్‌

ఏలూరులో మంగళవారం ఉదయం మావోయిస్టుల అరెస్ట్‌ నుంచి బుధవారం రాత్రి ఏడు గంటలకు వారిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించే వరకు అడుగడుగునా క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. అత్యంత కట్టుదిట్ట మైన భారీ భద్రత మధ్య మావోయిస్టులను బుధవారం మధ్యాహ్నం ఏలూరు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. వచ్చే నెల మూడో తేదీ వరకు వీరికి కోర్టు రిమాండ్‌ విధించడంతో రాత్రి ఏడు గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఏలూరు క్రైం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి):ఏలూరు కేకేఆర్‌ గ్రీన్‌సిటీలోని బస చేసిన 15 మంది మావోయిస్టులను మంగళవారం ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ పర్యవేక్షణలో పోలీసులు, గ్రేహౌండ్స్‌ దళాలు ఆకస్మికంగా దాడిచేసి అదుపులోకి తీసు కున్నారు. వీరిని మహిళా పోలీస్‌ స్టేషన్‌ భవనంలో ఉంచి బుధవారం ఉదయం ఆరు గంటలకు రెండు బస్సుల్లో విజయవాడ తరలించారు. అక్కడ మీడియా సమావేశం అనంతరం తిరిగి ఏలూరు తీసుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏ క్షణమైనా కోర్టుకు తీసుకొస్తారంటూ తెలియడంతో వారిని చూసేందుకు నగరవాసులు అధిక సంఖ్యలో కోర్టు ఆవరణ ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాం తంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ భవనం వద్ద రెండు ప్రత్యేక బస్సుల్లో వారిని కోర్టు వెనుక వైపు గేట్లను తీయించి లోపలికి తీసుకొస్తారనుకున్నారు. కానీ గేట్ల వరకు వచ్చి స్టేట్‌ బ్యాంక్‌ మీదుగా ఇండోర్‌ స్టేడియం, కలెక్టరేట్‌ మీదుగా తిరిగి మహిళా పోలీస్‌స్టేషన్‌ భవనానికి వెళ్లిపోయారు.

పోలీసులు ఇబ్బంది పెట్టారా ?

సాయంత్రం 4.30 తర్వాత బస్సుల్లో ఏలూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టుకు తీసుకొచ్చారు. వారందరి కీ ముఖాలకు ముసుగులు, చేతులకు బేడీలు, లీడింగ్‌ చైన్‌ వేసి ఒక్కొక్కరికి ఇద్దరు పోలీసులు చొప్పున ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశారు. కోర్టులోను వారిని లీడింగ్‌ చైన్‌, బేడీలతోనే హాజరు పరి చారు. ముగ్గురు మినహా మిగిలిన వారికి తెలుగు రాక పోవడంతో కుక్కునూరు ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఇద్దరు యువకులు మేజిస్ట్రేట్‌కు, మావోయిస్టులకు వారధులుగా గోండు భాషను తర్జుమా చేసి తెలుగులో మేజిస్ట్రేట్‌ ఎన్‌.మేరీకి వివరించారు. మేజిస్ట్రేట్‌ అడిగిన ప్రశ్నలను భాషను తర్జుమా చేసి మావో యిస్టులకు తెలిపి వారి సమాధానాన్ని తిరిగి వివరించారు. తండ్రి పేరు, ఊరు పేరు, ప్రాంతం వివరాలను అడిగారు. పోలీసులు అరెస్టు చేసినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా.. అని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఇబ్బంది పెట్టారా, శరీరంపై ఏమైనా గాయాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్ని గంటలకు అరెస్టు చేశారు వంటి ప్రశ్నలను అడిగి వారి నుంచి వివరాలు తెలుసు కున్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా కోర్టులో హాజరు పరిచారు. వారికి ఆధార్‌ కార్డులు, ఇతర వివరాలు ఉండాలని మేజిస్ట్రేట్‌ పోలీ సులకు సూచించ డంతో వారు అడవుల్లో ఉంటారని వారికి ఎలాంటి ఆధార్‌ కా ర్డులు ఉండవని, అరెస్టు చేసేటప్పుడు మధ్యవర్తులతో నిర్వహించిన పంచ నామా రిపోర్టులో పేర్కొనడంతో మేజిస్ట్రేట్‌ సంతృప్తి వ్యక్తం చేస్తూ 15 మంది మావోయిస్టులకు వచ్చేనెల 3వ తేదీ వరకు మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించా రు. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిం చడానికి ఆదేశాలు జారీ చేశారు.

సెంట్రల్‌ జైలుకు తరలింపు

ప్రత్యేక పోలీసు బలగాల మధ్య రాత్రి ఏడు గంటలకు ఏలూరు నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు మావోయిస్టులను తరలించారు. ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ స్వయంగా మహిళా పోలీస్‌స్టేషన్‌ భవనానికి వచ్చి మావోయిస్టులను కోర్టుకు తరలించేటప్పుడు ఆయనే స్వయంగా పరిశీలించారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏలూరు త్రీ టౌన్‌ సీఐ వి.కోటేశ్వరరావు, భీమడోలు సీఐ యూజేవిల్సన్‌, జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్‌, ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ బి.నాగబాబు, నగరంలోని పోలీసు సిబ్బంది, స్పెషల్‌ పార్టీ పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య వారిని కోర్టుకు హాజరుపరిచారు. 15 మంది మావోయిస్టులపై ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నెంబర్‌ 330/2025 అండర్‌ సెక్షన్‌ 147, 148, 149, 189 (2)(4) రెడ్‌విత్‌ 61(2) బీఎన్‌ఎస్‌ యాక్టు, 13–18–20–21–38 అండ్‌ ఉప 25(1ఎ ఆమ్స్‌ యాక్టు) కింద కేసు నమోదు చేశారు.

అరెస్టయిన మావోయిస్టులు వీరే..

అరెస్టయిన మావోయిస్టుల్లో సోడే లచ్చు అలియాస్‌ గోపాల్‌, సోడే లక్మా అలియాస్‌ భీమా, గంగి లక్ష్మి అలియాస్‌ మాదే, వెట్టి వెంకట్‌, మడకం వాగ, కాశ్యప్‌ భీమా అలియాస్‌ యోగేష్‌, పొడియం ఆనంద్‌ అలియాస్‌ దన్ను, మడకం లక్ష్మణ్‌ అలియాస్‌ కోస, కుంజుం బుజ్జి, తాటి కమల, దూది అడ్డు అలియాస్‌ మల్లేష్‌, మాధవి జోగా, మాధవి సునీత, కుంజుం నందిని, బాదిశ రాజు ఉన్నారు.

సోడే లచ్చు ఆయుధాలు తయారు చేయడం, వివిధ ఆపరేషన్లకు నాయకత్వం వహించేవాడని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ వివరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఏపీ పోలీస్‌ ఆపరేషన్‌ విజయవంతం చేసి 15 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో అనేక ఘటనలకు పాల్పడ్డారన్నారు. ఎన్‌ కౌంటర్ల నేపథ్యంలో తల దాచుకోవడానికి మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చారని, తదనంతరం ప్రణాళికలతో కార్య కలాపాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారన్నారు.

ఆ ఇల్లు చీకటిమయం

మావోలు దలదాచుకున్న కేకేఆర్‌ గ్రీన్‌ సిటీలో వున్న ఇంటిని చూడడానికి పలువు రు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. మంగళవారం రాత్రి వరకు ఆ భవనానికి పోలీసు లు కాపలా ఉన్నారు. బుధవారం ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. పోలీసులు కన్పించలేదు. మరోవైపు చుట్టుపక్క ల ఇళ్ల వారు గ్రీన్‌సిటీ ప్రాంతవాసులు తామంతా ఇన్ని రోజులు మావోయిస్టుల మధ్యలో ఉన్నామా.. అంటూ ఆశ్చర్యంతోపాటు కాస్తా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆ ఇల్లు చీకటి మయంలో ఉంది.

ముందుగానే అప్రమత్తం

కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌పీఎఫ్‌ భద్రత మావోయిస్టులు గోదావరి దాటి ఏలూరులోకి ప్రవేశించినట్లు అనుమానం !

జాలర్లను అప్రమత్తం.. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల ఆదేశం

కుక్కునూరు/వేలేరుపాడు, నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): ఏజెన్సీలోని కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌కు ఇరవై రోజుల క్రితమే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) బృందం వచ్చింది. అప్పటి నుంచి ఈ బృందం కుక్కునూరు పోలీస్‌ స్టేషన్‌కు భద్రత కల్పిస్తూ పహారా నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీస్‌ సిబ్బందితో కలిసి ఆదివాసీ గ్రామాలను సందర్శిస్తూ నిఘా పెంచారు. ఇదంతా చూస్తుంటే పోలీస్‌ యంత్రాంగం ముందే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇటీవల దండకారణ్యంలో జరుగుతున్న కూంబింగ్‌, ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ఆంధ్ర ప్రాంతానికి తరలి వస్తున్నారనే ఇంటెలిజెన్స్‌ ముందే గుర్తిం చింది. గోదావరి దాటితే కుక్కునూరు, వేలేరుపాడు మండ లాలున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమై పోలీస్‌ స్టేషన్లకు భద్రత పెంచింది.

వేలేరుపాడులో హైఅలర్ట్‌

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తప్పించుకున్న మావోయిస్టులు గోదావరి దాటి వచ్చి వేలేరుపాడు మండలం లోని అటవీ ప్రాంతంలో తలదాచుకునే అవకాశం ఉన్నందున పోలీసులు నిఘాను పెంచారు. మంగళవారం ఏలూరులో పట్టుబడిన మావోయి స్టులు ఏ ప్రాంతం మీదుగా ప్రయాణించి ఏలూరు చేరు కున్నారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. అల్లూరి జిల్లా చింతూరు, వరరామచంద్రా పురం మండలాల నుంచి గోదావరి తీరానికి చేరుకుని నది దాటి వచ్చి ఉంటారన్న కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు. నదిలో చేపల వేట సాగించే జాలర్లను అప్రమత్తం చేశారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై సమాచారం అందించాలని కోరారు. కూనవరం, రుద్రమ్మకోట, పడవరేవు మీదుగా మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉండడంతో వేలేరుపాడు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ పోలీస్‌ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తు న్నారు. మావోయిస్టుల కదలికలపై ఎస్‌ఐను వివరణ కోరగా ‘ప్రస్తుతం మండలంలో మావో యిస్టుల కదలికలపై ఎలాంటి సమాచారం లేదు. ఉన్నతాధికారుల సూచనలతో తనిఖీలు చేపడుతున్నాం’ అని తెలిపారు.

Updated Date - Nov 20 , 2025 | 12:37 AM