ఈ – ఆఫీస్‌తో పారదర్శకత
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:44 AM
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని కూటమి ప్రభుత్వం మరల అమలులోకి తెచ్చింది. ఈ– ఫైల్ విధానం వల్ల పనుల్లో పారదర్శకత ఉంటుంది.
త్వరితగతిన పనులు పూర్తి
ఇంటి నుంచే సేవలు పొందే అవకాశం
ఏలూరు టూటౌన్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని కూటమి ప్రభుత్వం మరల అమలులోకి తెచ్చింది. ఈ– ఫైల్ విధానం వల్ల పనుల్లో పారదర్శకత ఉంటుంది. ఉద్యోగుల్లో జవాబుదారీతనం ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 డిసెంబరు 20వ తేదీన ఈ–ఆఫీస్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఈ–ఆఫీస్ విధానాన్ని 2014–19 వరకు నిరాటకంగా అమలు చేశారు.
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మొక్కుబడిగా పరిపాలన సాగించింది. పనుల్లో పారదర్శకత లోపించి ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు. ప్రభుత్వ ఆఫీసుల్లో జవాబు దారీతనం తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ– ఆఫీస్ విధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అక్టోబరులో ఈ–ఆఫీస్ విధానంలో నగరాలు, మునిసిపాలిటీల్లో పటిష్టంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు నగర పాలక సంస్థలో ఈ–ఆఫీస్ విధానం వేగం పుంజుకుంది. దాదాపు 80 శాతం ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే పూర్తవుతున్నాయి. ఇంజనీరింగ్ సెక్షన్‌లో నిధులు లేక పనులు ఆలస్యంగా పూర్తి చేయ డంతో ఈ–ఆఫీస్ విధానం కొంచెం వెనుక బడింది. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సెక్షన్, పారిశుధ్యం, అకౌంట్స్, అడ్మినిస్ర్టేషన్ విభాగాల్లో పనులన్ని ఈ – ఆఫీస్ ద్వారా అమలవుతున్నాయి. దీంతో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరంలేకుండా పోయింది.
ఈ ఆఫీస్ అంటే..
నగరపాలక సంస్థలో పౌరులు ఆన్‌లైన్‌లో సేవలు పొందవచ్చు. కార్యకాల పాలన్ని డిజిటల్‌గా (కంప్యూటర్) జరుగుతాయి. ఈ– ఆఫీస్ సీడీఎంఏ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. పౌరులు తమ ఇంటి నుంచే వారి పని కోసం తమ ఇళ్లలో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. పని పూర్తయ్యేవరకు ఫైల్ ఎక్కడ ఉందో మానిటరింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకుని అక్కడ మరలా డిజిటల్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. జనన మరణ ధ్రువపత్రాలు, పౌరసేవలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను, తదితర పనులు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. చెల్లింపులు చేయాలన్న ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు.
ప్రజలకు సత్వర సేవలు అందించవచ్చు
ఈ–ఆఫీస్ ద్వారా ప్రజలు సతర్వమే సేవలు పొందవచ్చు. కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంటిలో నుంచే తమ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానంలో పారదర్శకత ఉంటుంది. ఎటువంటి అవినీతికి తావుండదు. నగరపాలక సంస్థ ప్రతీ పని ఈ–ఆఫీస్ ద్వారానే చేస్తున్నాం.
– ఎ.భానుప్రతాప్, కమిషనర్, నగరపాలక సంస్థ