Share News

మూకుమ్మడి తనిఖీలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:17 AM

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పరిస్థితిపై జిల్లా యంత్రాంగం మూకుమ్మడి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

మూకుమ్మడి తనిఖీలు
భీమవరం పీఎస్‌ఎం బాలికల స్కూల్లో విద్యార్థినులతో కలిసి భోజనం రుచి చూస్తున్న కలెక్టర్‌ నాగరాణి

జిల్లాలో ఒకేసారి 141 పాఠశాలల్లో తనిఖీలు

రంగంలోకి కలెక్టర్‌, డీఈవో, మండల అధికారులు

కదిలించిన ఆంధ్రజ్యోతి కథనం

భీమవరం రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పరిస్థితిపై జిల్లా యంత్రాంగం మూకుమ్మడి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఒకేసారి 141 మంది అధికారులు జిల్లాలోని 141 పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం నిర్వహణ, విధానాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారులు, తహసీల్దార్‌లు, పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్న భోజనం రుచి, నాణ్యతలను ప్రత్యేకంగా చూశారు.ఆహార పదార్థాల రుచులను విద్యార్థులతో కూర్చుని భోజనం చేసి మరీ తెలుసుకున్నారు. పరిశీలన జరిగిన ప్రతిచోట ఆహార పదార్థాల రుచులను విద్యార్థుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. వంటకాల్లో ఉపయోగించే నిత్యావసర సరుకులను అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించారు. కాళ్ళలో కోడిగుడ్లు బాగో లేదు అనే కథనం ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమవడంతో తనిఖీలు చేసినందుకు ప్రతిచోట కోడిగుడ్లను ప్రత్యేకంగా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. జిల్లాలోని 1,375 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద దాదాపుగా 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతుంది. చిన్న లోపం ఉన్నా విద్యార్థులకు అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. భీమవరంలోని పీఎస్‌ఎం బాలికోన్నత పాఠశాలలో కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు స్వయంగా రుచి చూశారు. విద్యార్థులకు గుడ్లు తినడం వల్ల ఏ పౌష్ఠికాహారం అందుతుందో తెలిపారు.

Updated Date - Nov 07 , 2025 | 01:17 AM