వైద్య కళాశాల భవనాల నిర్మాణంపై చర్చిద్దాం రండి
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:14 AM
ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలు నిర్మాణం పూర్తయినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) సవాల్ విసిరారు.
పూర్తయినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
వైసీపీ నేతలకు ఎమ్మెల్యే బడేటి సవాల్
టీడీపీ హయాంలోనే అనుమతులు నిధులు
పనులు చేపట్టింది మా ప్రభుత్వమే
వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది
ఇప్పుడు మేమే పూర్తి చేస్తాం
ఏలూరు క్రైం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలు నిర్మాణం పూర్తయినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) సవాల్ విసిరారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న వైద్య కళాశాల భవనం వద్ద ఎమ్మెల్యే చంటి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘అన్ని సదుపాయాలతో వైద్య కళాశాల పూర్తి చేశామని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, వైసీపీ నాయకులు చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. జిల్లా వైద్యాధికారి కార్యాలయ ఆవరణలో తాత్కాలిక భవనాల వద్ద కేక్ కట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఏలూరులో వైద్య కళాశాల ఏర్పాటు ఆలోచన 2018లో అప్పటి సీఎం చంద్రబాబు సంకల్పించి శంకుస్థాపన చేశారు. తర్వాత అధికారంలోకి రాకపోవడం తో వైసీపీ ప్రభుత్వం ఎక్కడో ఊరి చివర 34 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని శంకుస్థాపన చేసి మూలనపడేశారు. కేంద్రం నుంచి తొలుత అనుమతులు, నిధులు తమ ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేయించాం. రూ.525 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణం చేపట్టినా వైసీపీ పాలనలో రూ.125 కోట్లు ఖర్చు పెట్టారు. కూటమి ప్రభుత్వం రూ.80 కోట్లు ఖర్చుపెట్టి పనులు వేగవంతం చేస్తోంది. ఇంకా రూ.325 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టాల్సి వుంది. ఈ పనులన్ని ఏడాదిన్నరలో పూర్తవుతాయి. తమ ప్రభుత్వం వచ్చాకే అన్ని సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఏటిగట్టు ప్రాంతంలో ఎకరం 50 సెంట్లు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ భవనాల ప్రాంతం ఎకరం 12 సెంట్లు భూమిని వైద్య కళాశాలకు అప్పగిస్తూ చర్యలు తీసుకున్నాం. ఆ భవనాల్లో హాస్టల్స్ నిర్మిస్తాం. వైసీపీ నాయకులు సిగ్గు ఎగ్గు లేకుండా ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల అన్ని సదుపాయాలతో తామే నిర్మించామంటూ తాత్కాలిక భవనం వద్ద కేక్ కట్ చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కో ఆప్షన్ మెంబర్ చోడే వెంకటరత్నం, బెల్లంకొండ కిశోర్, నెర్సు గంగరాజు, పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.