Share News

వైద్యులు బాధ్యతగా పనిచేయాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:19 AM

వైద్యులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని, సీసీ కెమెరాల ద్వారా వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని అధికారులను ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు.

వైద్యులు బాధ్యతగా పనిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రి సెల్వి

ఏలూరు క్రైం,ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని, సీసీ కెమెరాల ద్వారా వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని అధికారులను ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీసీహెచ్‌ఎస్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌, సంబంధిత అధికారులతో ఆమె శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వాసుపత్రులలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు జరిగేలా చూడాలన్నారు. మెడికల్‌ కాలేజీ టెక్నీషియన్లు, టెక్నికల్‌ పోస్టులను త్వరితగతిన భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. శిథిలావస్థకు చేరిన 108 వాహనాలను ఆక్షన్‌వేసి, కొత్త వాహనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మెడికల్‌ కాలేజీ విద్యార్థులకు వసతి, విద్యా బోధన పట్ల సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మెడికల్‌ విద్యా ర్థులు వసతికి ఎటువంటి ఇబ్బందులు లేవని, అయితే సెప్టెంబరు 5వ తేదీ నాటికి మూడో బ్యాచ్‌ 150 మంది విద్యార్థులు వస్తారని వారికి వేరే చోట అన్ని సౌకర్యాలు ఉన్న వసతి గృహ భవనాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ లోపుగా మాతాశిశు భవనం రెండో ఫ్లోర్లో తాత్కాలికంగా వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఇదే హాస్పటల్‌లో ప్రస్తుతం ఉన్న డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయాన్ని వేరేచోట భవనానికి షిప్టు చేసి, ఖాళీ చేసిన భవనాన్ని హాస్పిటల్‌కి అప్పజెప్పాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పీజే అమృతం, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బి.పాల్‌సతీష్‌, ఏలూరు ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు, వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.భాస్కర్‌, 108 మేనేజరు డి. రాజు, ఏపీఎంఎస్‌ ఐడీసీ ఇంజనీరు యూఎస్‌వై రాజబాబు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:19 AM