ఏలూరు కాలువను ఏం చేస్తారు?
ABN , Publish Date - May 29 , 2025 | 11:57 PM
పశ్చిమ డెల్టాలో ఏలూరు పంట కాలువ నిరాదర ణకు గురవుతోంది. ఆధునికీకరణ విషయంలోనూ ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. కాలువకు అనుకుని వున్న పట్టణాలు, పల్లెల నుంచి మురుగు నీరు కాలువలో చేరుతోంది.
చెత్తా చెదారంతో మురుగు కాలువగా మార్చేశారు
ఆధునికీకరణకు కావాల్సింది కోట్లు.. ఇచ్చింది రూ.20 లక్షలు
ఈ సొమ్ముతో పనులు చేసేదెలా ? తూడు తొలగించేదెలా ?
నాలుగు నియోజకవర్గాల పరిధి.. లక్షన్నర ఎకరాల ఆయకట్టు
అయినా చిన్నచూపుపై రైతుల అసహనం.. అధికారుల నిస్సహాయత
(తాడేపల్లిగూడెం అర్బన్–ఆంధ్రజ్యోతి):
పశ్చిమ డెల్టాలో ఏలూరు పంట కాలువ నిరాదర ణకు గురవుతోంది. ఆధునికీకరణ విషయంలోనూ ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. కాలువకు అనుకుని వున్న పట్టణాలు, పల్లెల నుంచి మురుగు నీరు కాలువలో చేరుతోంది. పంట కాలువ కాలుష్య కాసారంగా మారుతోంది. అదే నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఈ సమస్యను అధిగ మించేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. నిధుల కొరత వెంటాడుతోంది. ప్రస్తుత వేసవిలోనూ కాలువ మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మాత్రమే మం జూరుచేశారు. ఏలూరు కాలువ పరిధిలో నాలుగు నియోజకవర్గాలు విస్తరించాయి. నలుగురు ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందరూ కూటమి ప్రభుత్వానికి చెందినవారే. అయినా సరే నిధుల విష యంలో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఏలూరు కాలువ కోసం ప్రత్యేకంగా తాడేపల్లిగూడెం నియోజక వర్గ పరిధిలోనే రూ.3 కోట్ల విలువైన ప్రతిపాదనలు పంపారు. పూడికతీత, గట్టు పటిష్టత, పరిశుభ్రత, రివైట్‌మెంట్ వాల్ నిర్మాణ పనులను ప్రతిపాదించా రు. వాస్తవానికి పశ్చిమ డెల్టాలో పంట కాలువలు, మురుగు కాలువల మరమ్మతుల కోసం రూ.40 కోట్లు కేటాయించారు. అయినా ఏలూరు కాలువ మొత్తానికి రూ.20 లక్షలు మాత్రమే మంజూర య్యాయి. సదరు నిధులతో పూడికతీత పనులు నిర్వహించలేమని ప్రజా ప్రతినిధులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. కాలువ మట్టి తొలగించేందుకు దాతలను సమీకరిస్తున్నారు.
గతమెంతో ఘనం
ఏలూరు పంట కాలువకు ఎంతో ఘనచరిత్ర ఉంది. బ్రిటీష్ కాలం నుంచి జలా రవాణా కోసం ఏలూరు కాలువను ఉపయోగించేవారు. అప్పట్లో బకింగ్ హం కాలువగా దీనిని పిలిచేవారు. ఇదే కాలువను మళ్లీ జల రవాణా కోసం ఇటీవల ప్రతి పాదనలు చేసింది. దాదాపు రూ.మూడు వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. సర్వేలు జలరవాణాకు ఆమోదయోగ్యం కాదంటూ ఈ ప్రాజెక్టును విరమిం చుకున్నారు. జల రవాణా ఉన్నప్పుడు తాడేపల్లి గూడెం పశ్చిమ గోదావరి జిల్లాకు పెద్ద మార్కెట్‌గా ఉండేది. జిల్లా నుంచి రైతులంతా సరుకుల విక్రయిం చేందుకు ఇక్కడ మార్కెట్‌పైనే ఆధారపడేవారు. ఇంతటి ఘనచరిత్ర వున్న ఏలూరు కాలువ నిరాదరణకు గురికావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జిల్లాలో అత్యధిక సాగు భూమి ఏలూరు కాలువ పరిధిలోనే ఉంది. దాదాపు 1.50 లక్షల ఎక రాల పంట భూమి ఏలూరు కాలువ పరిఽధిలో సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలువను పూర్తిగా విస్మరిస్తోంది. పశ్చిమ డెల్టా ఆధునికీకరణ కోసం 2008లో రూ.1,400 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.800 కోట్లతో పనులు ప్రారంభించారు. ఏలూరు కాలువ కోసం అప్పట్లోనే రూ.130 కోట్లతో పనులు చేసేందుకు ఏజెన్సీని ఖరారు చేశారు. కాలువ తవ్వకం, గట్లు పటిష్టత, రివిట్‌మెంట్ వాల్స్ నిర్మాణం, లాకులు, తూముల ఏర్పాటు, వంతెన నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కేవలం మట్టి పనులతోనే సరిపెట్టారు. అదికూడా తూతూమంత్రంగానే కాలువలో మట్టి తవ్వారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకయ్య వయ్యేరు, ఉండి, కాకరపర్రు, బ్రాంచ్ కెనాల్, గోస్తనీ కాలువల ఆధునికీకరణ పనులు అప్పట్లో దాదాపు పూర్తి చేశారు. ఏలూరు కాలువ పనులు మాత్రం చేపట్టలేదు. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తదుపరి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఆధునికీకరణ సమయంలోనూ ఏలూరు కాలువను పూర్తిగా విస్మరించారు. కూటమి ప్రభుత్వంలోనైనా పనులు జరుగుతాయని అంతా ఆశించారు. ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించి మమ అనిపించింది. దీనిపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కాలువలోనే చెత్త
ఏలూరు కాలువ విజ్జేశ్వరంలో ప్రారంభమై ఏలూరు కృష్ణా కెనాల్‌లో కలుస్తుంది. 90 కిలోమీటర్ల విస్తీర్ణం. నిడదవోలు, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు మండలాలను కలుపుతూ వెళుతుంది. తాడేపల్లిగూ డెం మున్సిపాలిటీతోపాటు నిడదవోలు, తాడేపల్లిగూడెం రూరల్, ఉంగుటూరు, భీమడోలు మండలాల ఎన్నో గ్రామాలు ఉన్నాయి. చెత్తతోపాటు నిర్మాణాల వ్యర్థాలను గట్లపై వేస్తున్నారు. అవి చివరకు కాలువలోకి జారిపోతున్నాయి. రేవుల వద్ద కాలువలో దిగాలంటేనే మోకాలిలోతు బురద. పూడిక తీయకపోవడంతో రేవులు నిరుపయోగంగా మారుతున్నాయి. తాగునీటి సరఫరాలోనూ ఇబ్బంది ఎదురవుతోంది.