విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:54 AM
విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న యువకుడు విద్యుదాఘా తంతో స్తంభంపైనే మృతి చెందాడు.
జంగారెడ్డిగూడెం,జూన్ 12 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న యువకుడు విద్యుదాఘా తంతో స్తంభంపైనే మృతి చెందాడు. నెల్లూరు జిల్లా భీమవరప్పాడుకు చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ కొమ్మి మన్మధ శేఖర్ వద్ద కృష్ణాజిల్లా చంద్రాల గ్రామానికి చెందిన మదిరి నవీన్ (26) పని చేస్తున్నాడు. మైసన్న గూడెంలో పలు విద్యుత్ లైన్ల పనులు చేస్తున్నారు. గురువారం నవీన్‌తో పాటు మరో ఇద్దరు పనులు పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్నారు. అదే సమయంలో మైస న్నగూడెం లైన్‌మన్ యాదాల సురేష్ వచ్చి స్తంభంపై చిన్న పని ఉందని నవీన్‌ను తీసుకువెళ్లగా మిగిలిన ఇద్దరు జంగారెడ్డిగూడెం వెళ్లిపోయారు. 11 కేవీ హెచ్‌టి విద్యుత్ స్తంభంపై నవీన్ పని చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతంతో స్తంభం పైనే మృతి చెందాడు. సమా చారం అందుకున్న విద్యుత్ శాఖ ఏడీఈ సుబ్బారావు, ఎస్సై ఎస్‌కే.జబీర్ సంఘటనా స్ధలానికి చేరుకుని మృత దేహాన్ని కిందికి దించి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసు పత్రికి తరలించారు. ఏడీఈ సుబ్బారావు మాట్లాడుతూ మరమ్మతుల నిమిత్తం ఎల్‌సి తీసుకున్నారని, దగ్గరలో ఇళ్లకు వెళ్లిన సరఫరా రిటన్‌తో ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక అంచనాలో నిర్ధారణకు వచ్చామన్నారు.
భవన నిర్మాణ పనుల్లో ఉండగా..
తాడేపల్లిగూడెం రూరల్: కొత్తూరులో భవన నిర్మాణ పనిలో విద్యుత్ వైరు తగిలి యువకుడు మృతి చెందాడు. దార్లంక మునేశ్వరరావు (నాని) (35) గురువారం తాపీ పనిచేస్తుండగా విద్యుత్ వైరు కాలికి తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నాని అవివాహితుడు. తండ్రి విష్ణు దుబాయ్ వెళ్లగా తల్లితో నవాబుపాలెంలో ఉంటున్నాడు. తల్లి ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశారు.