Share News

అడుగడుగునా.. నీరాజనం!

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:06 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాథపురం సుందరగిరిపై వున్న లక్ష్మీ నారసింహుని ఆలయాన్ని సందర్శించారు.

అడుగడుగునా.. నీరాజనం!
రాజవరంలో పవన్‌ అభివాదం

ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ఐఎస్‌ జగన్నాథపురం లక్ష్మీనారసింహునికి పూజలు

రూ.7.20 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూపత్రాలు అందజేత

లక్ష్మీనరసింహస్వామి వైభవం–ఉపా సనా విధానం పుస్తకం ఆవిష్కరణ

ద్వారకాతిరుమల/కొయ్యలగూడెం నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాథపురం సుందరగిరిపై వున్న లక్ష్మీ నారసింహుని ఆలయాన్ని సందర్శించారు. గంటన్నరసేపు జరిగిన పర్యటనలో ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐఎస్‌ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి విచ్చేసిన పవన్‌ కల్యాణ్‌కు దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, చినవెంకన్న ఆలయ అనువంశిక ఽధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తి పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. పట్టువస్త్రాలను పవన్‌ తన శిరస్సుపై ఉంచు కుని గర్భాలయంలో కొలువుదీరిన నరసన్నకు సమర్పించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆయనకు, మంత్రి నాదెండ్లకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. స్వామి మూలవిరాట్‌ చిత్రపటాన్ని, ప్రసాదాలను కమిషర్‌ రామచంద్రమోహన్‌, ట్రస్టీ నివృతరావు, ఈవో మూర్తి అందచేశారు. అనంతరం ఆయన యాగశాలను సందర్శించి హోమగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ‘ఐఎస్‌ జగన్నాథపురంలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వైభవం– ఉపాసనా విధానము’ అనే పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు.ఆలయ అభివృద్ధికి కేటాయించిన 30 ఎకరాల భూమి హక్కు పత్రాలను రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌, ఈవో సత్యనారాయణమూర్తిలకు అందజేశారు. సుమారు 11:40 గంటలకు వచ్చిన ఆయన ముందుగా గ్రామంలో దాదాపు 100 మీటర్ల మేర నిర్మించిన మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం లక్ష్మీనారసింహుని దర్శించుకున్నారు. ఆలయం ముందు భాగంలో దేవదాయశాఖ నిఽధులు రూ.3.50 కోట్లతో నిర్మించనున్న ప్రదక్షిణ మండపం, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్‌ ఎసెట్స్‌ నిధులు రూ.3.70 కోట్లతో పీఆర్‌ రహదారి నుంచిఆలయానికి వెళ్లేందుకు బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు.

అదే రోడ్డులో.. పాదయాత్ర

కొయ్యలగూడెం మండలం రాజవరంలో గత ఏడాది చేసిన విధంగానే మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన కోన విజయలక్ష్మి అధ్వానంగా ఉన్న రోడ్డును చూపించి ‘రోడ్డు వేయండయ్యా’ అని వేడుకుంది. దీనిపై ఆయన అప్పటికప్పుడు రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆ రోడ్డుపైకి పవన్‌ రాగానే కారు దిగి పాదయాత్ర చేశారు. రోడ్డు అడిగిన విజయలక్ష్మితో బేటీ అవుతారని అధికారులు ఏర్పాట్లు చేశారు. జనసైనికులు ఒక్కసారిగా ఆయన మీదకు రావడంతో పవన్‌ ఆమెతో మాట్లాడకుండానే ముందుకు వెళ్లిపోయారు. ఒక చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. కాన్వాయ్‌కు అడ్డుపడి పవన్‌తో పలువురు యువకులు సెల్ఫీలు దిగారు.

వినతుల హోరు

పవన్‌కు పలు సమస్యలపై వినతులు ఇచ్చారు. కొయ్యలగూడేన్ని మునిసిపాలిటీ చేయాలని వినతిపత్రం అందజేశారు.గవరవరం నుంచి తిమ్మన్న కుంట వరకు రహదారి నిర్మించాలని గంగన్నగూడెం గ్రామస్థులు వినతిపత్రం ఇచ్చారు.ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు.

పర్యటన.. గందరగోళం

పవన్‌కల్యాణ్‌ పర్యటనలో గందరగోళం నెలకొంది. ముందుగా రాజవరానికి హెలికాఫ్టర్‌లో వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి వెళ్తారని సమాచారం ఇచ్చారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రాజవరంలో హెలీప్యాడ్‌ సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రానికి మరలా రోడ్డు మార్గాన వస్తున్నారని సమాచారం వచ్చింది. అధికారులు కనకాద్రిపురం నుంచి ఐఎస్‌.జగన్నాఽథపురం వరకు రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన రాజవరానికి చేరుకున్నారు. ఆరిపాటి దిబ్బలు, రాజవరం, మంగదేవి పేట, గంగవరం గ్రామాల మీదుగా కాన్వాయ్‌ సాగింది. అన్ని గ్రామాల వద్ద పవన్‌ కల్యాణ్‌ కారు నుంచి బయటకు వచ్చి ప్రజలందరికి కనబడుతూ వారు ఇచ్చిన వినతులు తీసుకున్నారు.

ఘన స్వాగతం

పవన్‌కు అడుగడుగునా ప్రజలు హారతులు పట్టారు. పూలవర్షాన్ని కురిపించారు. జై పవన్‌కల్యాణ్‌, జై జనసేన అంటూ నినదించారు. ఆలయం వద్ద, రాజవరం వద్ద ఆయనకు ప్రభుత్వ విప్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌, గోపాలపురం, పోలవరం, ఉంగుటూరు, నరసాపురం, ఏలూరు, భీమవరం ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట్రాజు, చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, బొమ్మిడి నారాయణ నాయకర్‌, బడేటి రాధాకృష్ణ, పులవర్తి రామాంజనేయులు, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్‌శివకిశోర్‌, జనసేన నాయకులు కరాటం సాయిబాబు, గడ్డమణుగు రవికుమార్‌ తదితరులు స్వాగతం పలికారు.

Updated Date - Nov 25 , 2025 | 12:06 AM