మండవారి గరువులో హైటెన్షన్
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:01 AM
మండలంలోని రుస్తుం బాదా పంచాయతీ పరిధిలో ఉన్న మండవారి గరువులో గురువారం హైటె న్షన్ నెలకొంది.
మునిసిపల్ చెత్త వేసేందుకు వచ్చిన వాహనాలు అడ్డగింత
రోడ్డుపై మహిళల వంటా వార్పు
పొద్దుపోయేవరకు ఆందోళన
నరసాపురం రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రుస్తుం బాదా పంచాయతీ పరిధిలో ఉన్న మండవారి గరువులో గురువారం హైటె న్షన్ నెలకొంది. పట్టణంలోని చెత్తను గ్రామంలోని జగనన్న కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో వేసేందుకు మునిసిపాలిటీ నిర్ణయించింది. చెత్త వేసేందుకు గురువారం నాలుగు లారీలు, నాలుగు ట్రాక్టర్లతో స్థలం వద్దకు వెళు తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. అక్కడే టెంట్ వేసి ధర్నాకు దిగారు. వంట వార్పుతో నిరసన తెలిపారు. దీంతో ఆర్డీవో దాసిరాజు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్, కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ సత్యనారయణ, సీఐలు యాదగిరి, దుర్గాప్రసాద్, ఎస్సైలు వెంకట సురేష్, జయలక్ష్మి సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. ట్రాక్టర్లను అనుమతించేది లేదని గ్రామస్థులు భీష్మించారు. పట్టణం లో చెత్తను పచ్చని పొలాల మధ్య వేస్తే పంట కాల్వలు, వ్యవసాయం దెబ్బతిం టుందని, సమీపంలోని మంచినీటి చెరువు కలుషితం అవుతుందని వాపో యారు. చెత్త వేసేందుకు మా గ్రామమే దొరికిందా అంటూ అధికారులతో వాగ్వా దానికి దిగారు. దీంతో ఐదు గంటల పాటు హైటెన్షన్ నెలకొంది. చెత్త అక్కడ వేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండదని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిసరాల్లో ఎక్కడ నివాసాలు లేవని, ప్రభుత్వ స్థలంలోనే చెత్త వేస్తున్నామన్నారు. చుట్టూ ఫెన్సింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ గ్రామ స్థులు ఒప్పుకోలేదు. పట్టణంలో చెత్త రోజు రోజుకు పెరిగి పోవడంతో దాన్ని ఎక్కడ వేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. చివరికీ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో వేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావిం చారు. దానికి కూడా ప్రజల నుంచి నిరసనలు ఎదురు కావడంతో పేరుకు పోయిన చెత్తను ఎక్కడ తరలించాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.