Share News

రెడీఎస్సీ

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:58 AM

నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు చిరకాలంగా ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ–2025 నియామకాల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరువైంది.

రెడీఎస్సీ
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో వెంకట లక్ష్మమ్మ

రేపే.. మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ఎంపికైన అభ్యర్థుల లాగిన్‌లకే నేరుగా కాల్‌ లెటర్లు

సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో విస్తృత ఏర్పాట్లు

ఏలూరు అర్బన్‌, ఆగస్టు23(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు చిరకాలంగా ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ–2025 నియామకాల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరువైంది. డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్‌ జాబితాలను సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన విద్యాశాఖ తదుపరి సెలెక్టెడ్‌ అభ్యర్థుల యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లతో కూడిన లాగిన్‌లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిమిత్తం శనివారం రాత్రి లేదా ఆదివారం కాల్‌ లెటర్లను పంపడానికి ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,074 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్‌ మార్గదర్శకాలకు లోబడి నియామకాలను పూర్తిచేసి, సెప్టెంబరు 5న కొత్త ఉపాధ్యాయులు విఽధుల్లో చేరేలా కసరత్తు జరుగుతోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల 48 మండలాలు, మున్సిపాల్టీలు, ఏలూరు నగరపాలకసంస్థ యాజమాన్యాల టీచరు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వట్లూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలకు హాజరుకావాల్సి ఉంది. సర్టిఫికెట్ల పరిశీలనలో ఎవరైనా అభ్యర్థులు అనర్హులుగా తేలితే వారిస్థానంలో తదుపరి మెరిట్‌ అభ్యర్థులను పిలుస్తారు. ధ్రువపత్రాల పరిశీలనలో పాటించాల్సిన మార్గదర్శకాలపై శనివారం సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉమ్మడి జిల్లా డీఈవో, డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వెంకటలక్ష్మమ్మ, పలు శాఖల జిల్లా అధికారులు, విద్యాధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా డీఈవో నారాయణ, అసిస్టెంట్‌ డైరెక్టర్లు అవధాని, వెంకట ప్పయ్య, డీవైఈవోలు రవీంద్రభారతి, సుధాకర్‌, ఎంఈవో ఎస్‌.నరసింహమూర్తి పాల్గొన్నారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఏర్పాట్లపై ముఖ్యాంశాలు..

పాఠశాల విద్యాశాఖ యాజమాన్యంలో మొత్తం 1,035 పోస్టులు, గిరిజన సంక్షేమశాఖ ఆశ్రం పాఠశాలల్లో 32 పోస్టులు, జువనైల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ స్కూల్స్‌లో ఏడు పోస్టులు కలిపి మొత్తం 1,074 ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వెరిఫికేషన్‌ నిమిత్తం సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 2 బ్లాకుల్లో 22 కౌంటర్లు, 44 ప్రత్యేక గదుల్లో ఏర్పాట్లు చేశారు. 3 స్టాండ్‌ బై కౌంటర్లు, 6 ప్రత్యేక గదులను సిద్ధంగా ఉంచారు. అన్నింటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసి శనివారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు.

హాజరైన అభ్యర్థులకు అవగాహన నిమిత్తం కళాశాల గేటు వద్ద సెలక్షన్‌ జాబితాలను ప్రదర్శిస్తారు. సీనియార్టీ లిస్టు ప్రకారం అభ్యర్థులకు గేటువద్దే టోకెన్‌ ఇచ్చి లోపలికి పంపిస్తారు. అభ్యర్థితోపాటు ఒక సహాయకున్ని అనుమతిస్తారు. ప్రతీ 50 మంది అభ్యర్థులకు ఒక కౌంటర్‌ చొప్పున కేటాయించారు.

ప్రతీ కౌంటర్‌లో ఒక ఎంఈవో, ఒక సీనియర్‌ హెచ్‌ఎం, ఒక డిప్యుటీ తహసీల్దార్‌, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారు. ఈ కౌంటర్లన్నింటినీ పర్యవేక్షించేందుకు ఐదు టీమ్‌లుంటాయి. ఒక్కో టీమ్‌లో డీవైఈవో, సీనియర్‌ విద్యాధికారులుం టారు. ప్రభుత్వ నోడల్‌ ఆఫీసర్‌గా సమగ్రశిక్ష స్టేట్‌ అకడమిక్‌ మోనటరింగ్‌ ఆఫీసర్‌ నాగేశ్వరరావును ప్రభుత్వం నియమించింది.

కౌంటర్‌ వద్దకు వచ్చిన అభ్యర్థినుంచి అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, మూడుసెట్ల అటెస్టెడ్‌ జిరాక్స్‌ కాపీలు తీసుకుని, వారివద్ద వున్న వివరాలతో సరిపోల్చుకుంటారు. వాటిని నిర్ణీత చెక్‌లిస్టులో నమోదు చేస్తారు. తదుపరి జిరాక్స్‌ కాపీల సెట్లను తీసుకుని, ఒరిజినల్స్‌ అభ్యర్థికి ఇచ్చేస్తారు. టీమ్‌ ఓకే అన్నవెంటనే చెక్‌లిస్టుని డీఈవోకు పంపిస్తారు. అక్కడ డీఈవో సంతకంచేసిన వెంటనే చెక్‌లిస్టుని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో అభ్యర్థి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

కళాశాల ప్రాంగణంలో పారిఽశుధ్యం, తాగునీరు, ప్రథమచికిత్స, నిరంతర విద్యుత్‌ సరఫరా, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సంబందిత శాఖలు చేస్తున్నాయి. కులధ్రువీకరణ, స్థానికత ధ్రువీకరణ, వైకల్య ధ్రుువీకరణ పత్రాల జెన్యూనిటీని పరిశీలించేందుకు రెవెన్యూ, సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, డిజేబుల్డ్‌ వెల్ఫేర్‌, సైనిక్‌ వెల్ఫేర్‌, ఐటీడీఏ, జువనైల్‌ డిపార్ట్‌ మెంట్‌ల నుంచి అధికారులను నియమించారు. కళాశాల ప్రాంగణంలో రద్దీ సమస్య తలెత్త కుండా వ్యాయామోపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటున్నారు.

సెలెక్టెడ్‌ జాబితాలోవున్న అభ్యర్థులు వెరిఫికేషన్‌కు సంబంధించి ఏదైనా సమాచారం కోసం హెల్ప్‌లైన్‌/హెల్ప్‌డెస్క్‌ నంబర్లు 90307 23444 (సీనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌), 95056 44555(ఏఎస్‌వో అక్బర్‌)లను సంప్రదించవచ్చు. అభ్యర్థులు, వారి సహాయకులకు అల్పాహారం, భోజన సౌకర్యం నిమిత్తం కళాశాల క్యాంటీన్‌ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. నిర్ణీత ధర చెల్లించి వాటిని పొందవచ్చు.

Updated Date - Aug 24 , 2025 | 12:58 AM