Share News

కొల్లేరు అతిథులకు అవస్థలు

ABN , Publish Date - May 31 , 2025 | 12:31 AM

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు అతిథులైన వలస పక్షులకు అవస్థలు తప్పడం లేదు.

కొల్లేరు అతిథులకు అవస్థలు
ఆటపాక పక్షుల కేంద్రంలో నీరు లేక ఎండిపోయిన చెరువు

నీరు లేక ఎండిన చెరువు

అల్లాడుతున్న వలస పక్షులు

ఆహారం దొరక్క వేరొక చోటికి వలస

కొల్లేరులో వసతుల కొరత

పర్యాటకులకు తప్పని పాట్లు

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు అతిథులైన వలస పక్షులకు అవస్థలు తప్పడం లేదు. పర్యాటకంగా ఎంతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన వసతులు లేకపోవడంతో పర్యావరణ ప్రేమికులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వాలు కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటిపై దృష్టి పెట్టడం లేదు. వేసవిలో నీరు ఎండిపోవడంతో పక్షులు అల్లాడుతున్నాయి. ఆహారం కూడా అందని పరిస్థితిలో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి.

కైకలూరు, మే 30(ఆంధ్రజ్యోతి): కొల్లేరు సర స్సు 77,138 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కేవలం 310 ఎకరాల చెరువులో మాత్రమే వలస పక్షుల ఆవాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. కొల్లేరుకు వరద వస్తే ఈ చెరువు సరస్సులో కలిసి పోతుంది. వేసవిలో నీరు లేక ఎండిపోతుంది. పక్షులకు ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో కొల్లేరు నుంచి తిరిగి సుదూర ప్రాంతాలకు వలస పోతున్నాయి. కొల్లేరు సరస్సు పక్షులకు స్వర్గధామం. ఇక్కడి వాతావరణం వాటికి ఎంతో అనుకూలం, సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. ఇలాంటి వలస పక్షుల కోసం ఏర్పాటుచేసిన కైక లూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం చెరువు. ఈ చెరువుకు చుట్టూ కొల్లేరు సరస్సు, సరస్సులోని పోల్‌రాజ్‌ డ్రెయిన్‌తో చెరువులో నీరు నిల్వ ఉండక వేసవిలో పూర్తిగా అడుగంటి పోతుంది. చెరువు గట్టును బలోపేతం చేయకపో వడంతో నీరు లేక వెలవెలబోతుంది. ఏటా వరదల సమయంలో ఉన్న కొద్దిపాటి గట్లు మునిగిపోతాయి. వేసవిలో నీరు ఇంకిపోవడంతో బోటు షికారును అధికారులు నిలిపివేస్తారు. వేసవి సెలవుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నిరుత్సాహానికి గురువతు న్నారు. అంతేగాక చెరువులో విలువైన మత్స్య సంపద మృత్యవాత పడుతుంది. మత్స్య సంపద ఆహారమైన పక్షలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. ఏటా ఈ పరిస్థితి పునరావృతం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

పక్షుల కేంద్రం చెరువు నీటి నిల్వలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరు కాకపోవడంతో ఈ సంవత్సరం తవ్వకాలు చేపట్టలేం. త్వరలో వీటిపై అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే గాక వర్షాలు ముందుగా వస్తున్నందున త్వరితగతిన చెరువు నింపి బోటు షికారు చేసేలా చర్యలు తీసుకుంటాం.

రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్‌

Updated Date - May 31 , 2025 | 12:31 AM