సెకండరీ విద్య సంస్కరణలపై డీఆర్పీలకు శిక్షణ ప్రారంభం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:18 AM
సెకండరీ విద్య బోధించే స్కూల్ అసిస్టెంట్లకు నూతన విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న పలు అంశాలపై శిక్షణనిచ్చే కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు మూడు రోజుల శిక్షణ తరగతులు స్థానిక సుబ్బమ్మదేవి మునిసిపల్ హైస్కూలులో మంగళవారం ప్రారంభమయ్యాయి.
ఏలూరు అర్బన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : సెకండరీ విద్య బోధించే స్కూల్ అసిస్టెంట్లకు నూతన విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న పలు అంశాలపై శిక్షణనిచ్చే కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు మూడు రోజుల శిక్షణ తరగతులు స్థానిక సుబ్బమ్మదేవి మునిసిపల్ హైస్కూలులో మంగళవారం ప్రారంభమయ్యాయి. లాంగ్వేజెస్, నాన్–లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో 160మంది స్కూల్ అసిస్టెంట్లు, 14మంది హెచ్‌ఎంలను బృందాలుగా విభజించి శిక్షణ అంశాలపై చర్చాగోష్టులు, డివిజన్లు, మండలాల్లో చేపట్టాల్సిన శిక్షణ కార్యక్రమాలను వివరించారు. కోర్సు డైరెక్టర్, డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణ పూర్తిచేసుకున్న డీఆర్పీలందరూ జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 3,250మంది స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులకు ఈనెల 8, 9, 10 తేదీల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నూతన విద్యాసంవత్సరంలో అమలుచేయనున్న టీచర్ హ్యాండ్‌బుక్, స్టూడెంట్ అసెస్‌మెంట్ బుక్, కరికులం ఇంటిగ్రేషన్, అకడమిక్ కేలండర్‌లను ప్రభుత్వ నిబంధనల మేరకు కచ్చితంగా పాటించాలని సూచించారు. పరిశీలకునిగా విచ్చేసిన ఎస్సీఈఆర్టీ ప్రతినిధి రాజాబాబు మాట్లాడుతూ ఆరో తరగతి బాలబాలికలకు సంసిద్ధతా కార్యక్రమం, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు, 40 రోజుల బ్రిడ్జి కోర్సులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కొత్త విద్యాసంవత్సరంలో 1,2 తరగతులు, 9, 10 తరగతులకు హిందీ సబ్జెక్టులో నూతన సిలబస్ పాఠ్యపుస్తకాలు రూపొందాయని వెల్లడించారు. స్టేట్ రిసోర్స్‌పర్సన్లు, దూబచర్ల ‘డైట్’ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.