గాడితప్పిన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:52 PM
తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు నరకం చూపిస్తున్నారు.
ఏలూరు క్రైం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రిల్లో ప్రసవించిన బాలింతను ఆమెకు జన్మించిన పండంటి శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు తీసుకువెళ్ళే నిమిత్తం 2015 జనవరి 1వ తేదీన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి సేవలు కొనసాగుతున్నా వైసీపీ పాలనలో గాడితప్పిన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా గాడిలో పడలేదనే తెలుస్తోంది. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు నరకం చూపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం లింగపాలెం మండలం న్యాయంపల్లి గ్రామా నికి చెందిన మద్దాల సుప్రియ (29) నిండు గర్భిణీ కావడంతో ఐదు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఆమె నార్మల్ డెలివరీ కావడంతో పుట్టిన ఆడ శిశువు అనారోగ్యంగా ఉందని ఎస్‌ఎన్‌సియు విభాగం లోని బాక్సులో ఉంచారు. సుప్రియను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జి చేశారు. బాక్సులో ఉన్న తన బిడ్డను తీసుకుని ఆసుపత్రి గేటు వద్ద తన కుటుంబ సభ్యులతో పసిబిడ్డను వడిలో పెట్టుకుని పడిగాపులు పడుతున్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు ఫోన్ చేయగా వస్తున్నామని కసురుకున్నా రని బాధితురాలు ఆరోపించారు. సాయంత్రం దోమల్లో ఎంత సేపు కూర్చోవాలని వారు ప్రశ్నించినా ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అవసరమైతే రేపు తీసుకువెళతాం. లోపలే ఉండడంటూ చెప్పాడని వాపోయారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సురక్షితంగా తీసుకు వెళ్తారని ఆ వాహనం కోసం ఫోన్ చేయగా ఎంతో అవమానించారని బాధితురాలు, వారి కుటుంబ సభ్యు లు వాపోయారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటె ండెంట్ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన చెప్పినప్పటికీ ఆ డ్రైవర్ రాలేదని చెప్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు ఆ డ్రైవర్ రాకపోవడంతో ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో ఒక డ్రైవర్ ఉరుకులు పరుగులు మీద వాహనాన్ని తీసుకువచ్చి వారి పట్ల ఎంతో మర్యాదగా వ్యవహరిస్తూ తీసుకువెళ్ళడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ సంస్ధ నిర్వహణ సంస్థపై కూడా దృష్టి సారించాలని, అసలు డ్రైవర్లు ఇక్కడ పనిచేస్తున్నారో లేదో కూడా తెలియడం లేదని పలువురు చెప్తున్నారు.