ఏం చేద్దాం..!
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:10 AM
చాన్నాళ్ల తర్వాత జిల్లా సమీక్షా కమిటీ సమా వేశం(డీఆర్‌సీ)లో అజెండాపై అర్థవంతమైన చర్చ సాగింది. పొరపాట్లకు తావివ్వకుండా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమ స్యలను పరిష్కారానికి మమైకమై పాటు పడుదామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.
చాన్నాళ్లకు డీఆర్‌సీలో అర్థవంతమైన చర్చ
పొరపాట్లకు తావివ్వకుండాఅధికారులు మమేకం
జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసిన మంత్రి నాదెండ్ల
ఇళ్లు సగంలో వదిలేసిన కాంట్రాక్టర్లపై చర్యలు : మంత్రి కొలుసు
సమస్యలపై గళమిప్పిన ఎమ్మెల్యేలు
ఏలూరు,నవంబరు 26(ఆంధ్రజ్యోతి): చాన్నాళ్ల తర్వాత జిల్లా సమీక్షా కమిటీ సమా వేశం(డీఆర్‌సీ)లో అజెండాపై అర్థవంతమైన చర్చ సాగింది. పొరపాట్లకు తావివ్వకుండా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమ స్యలను పరిష్కారానికి మమైకమై పాటు పడుదామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి అంశంపై ఆయన ‘ఏం చేద్దాం.. ఏ చర్యలు తీసుకుందాం..’ అంటూ ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు.
కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశం మంత్రి ఇన్‌చార్జి నాదెండ్ల అధ్య క్షతన బుధవారం మూడు గంటల పాటు సాగింది. రోడ్లు, యూరియా కొరత, ఇళ్ల నిర్మాణాలు, 22ఏ తదితర అంశాలపై చర్చ చేపట్టారు. తొలుత మంత్రి రబీకి యూరియా కొరత ఉందా? ఏం చేద్దామంటూ ఎమ్మెల్యేల నుంచి ఆరా తీశారు. పోలవరం మండ లంలో మొక్కజొన్నకు యూరియా అవసరమని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంత్రిని కోరారు. మనోహర్ మాట్లాడుతూ ‘జిల్లాలో ధాన్యం సేకరణకు రైతుల కోసం 65 లక్షల నాణ్యమైన గోనె సంచులను సిద్ధంగా ఉంచాం. ఈనెల 28 నుంచి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ రైతు సేవాకేంద్రం వద్ద 20 నుంచి 25 వరకు టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాం. రైతులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొంటాం’ అన్నా రు. రోడ్ల మరమ్మతులు లేకపోవడం.. ప్రధాన రహ దారుల వెంబడి, మార్జిన్లు వెంబడి ఆర్‌అండ్‌బీ అధికా రులు రక్షణ చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రామాకేర్ సెంటర్ రిఫర్ చేస్తున్న కేసులు సగటున ప్రతీ నెల 50 వరకు ఉండటం పైనా ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, డీఆర్‌సీ వైస్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, మెంబర్ కన్వీనర్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సబ్ కలెక్టర్ వినూత్న, టెరిటోరియల్ డీఎఫ్‌వో వి.సందీప్‌రెడ్డి, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, సీపీవో వాసుదేవరావులు పాల్గొన్నారు. కాగా సమావేశానికి కైకలూరు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు గోపీమూర్తి, జయమంగళ వెంకట రమణ, వంకా రవీంద్రలు గైర్హాజరు అయ్యారు.
నిషేధిత భూముల్లోకి ఎలా చేర్చారు?
ప్రభుత్వ ఆదేశాలతో డీఆర్‌సీలో 22ఏ నిషేఽధిత భూములపై చర్చకు ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి నాదెండ్ల రెవెన్యూ యంత్రాంగాన్ని, కలెక్టర్‌ను ఆరా తీశారు. దీనిపై అరగంటకు పైగా చర్చ సాగింది. 22 ఏ కింద 205 దరఖాస్తులు రాగా 125 పరిష్కా రానికి సిద్ధం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సమస్య జిల్లా అంతా ఉంటుందని, ఒక గ్రీవెన్ సెల్ నిర్వహిస్తే అందరి సమస్యలను స్వీకరించ వచ్చని నాదెండ్ల వివరించారు. మంత్రి కొలుసు మాట్లాడుతూ ప్రజల ప్రైవేట్ భూములను ఉద్దేశ పూర్వంగా కొంత మంది అధికారులు నిషేధిత జాబి తాలో చేర్చారని, అటువంటి భూములను గుర్తించా లని సూచించారు. అలా చేర్చిన వారిపై చర్యలుం డాలని కోరారు.
మంత్రి మనోహర్ డెడ్‌లైన్లు..సూచనలు
డిసెంబరు 16న కలెక్టరేట్‌లో 22ఏ (నిషేధిత భూముల్లో చేర్చిన) అంశంపై జిల్లాలోని మూడు డివిజన్‌ల నుంచి వినతుల స్వీకరణకు మెగా గ్రీవెన్స్ డే నిర్వహణ ... వచ్చిన దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలి. జిల్లాలో పీఎంఏవై 1,2 కింద మంజూరైన 38 వేల ఇళ్లను మార్చి నాటికి పూర్తి చేయాలి. రబీ సీజన్‌లో వారం వారం ఎమ్మెల్యేలతో యూరియాపై సమీక్షించి. కలెక్టర్ దృష్టిలో పెట్టి ఆ మేరకు సరరఫరాకు వ్యవసాయశాఖ జేడీ పర్యవేక్షించాలి. జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారులపై ఏర్పడిన గోతులకు రెండువారాల్లో మరమ్మతులు పూర్తి చేయాలి. పెట్టుబడుల సదస్సులో జిల్లాకు వచ్చిన ఐదు పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు, ఇతర అంశాలను వేగంగా పరిష్కరించాలి. ఏలూరు ఆశ్రం నుంచి టౌన్‌లోకి ప్రవేశించే ప్రాంతాల్లో రోడ్డు అభివృద్ధి చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుని లైట్లు ఏర్పాటు చేయాలి. విజయరాయి కోకోనట్ బోర్డులో మదర్ విత్తన చెట్ల పంపిణీలో అవకతవలపై ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటుకు మంత్రి సూచించగా కలెక్టర్ వెట్రిసెల్వి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇళ్లు పూర్తిచేయని వారిపై చర్యలు : మంత్రి కొలుసు పార్థసారథి
జిల్లాలో వివిధ కాలనీల్లో ఇళ్లను పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునేందుకు హౌసింగ్ అధికారులు ఎమ్మెల్యేల ద్వారా వివరాలను సేకరించి అందివ్వాలి. సగం ఇళ్లు కట్టిన వదిలేసిన కాంట్రాక్టర్లు అవి పూర్తి చేస్తే సరే.. లేకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. రెవెన్యూ రికవరీ యాక్టు కింద డబ్బులు కట్టిస్తాం. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్ సెల్ నిర్వహించాలి.
విజయరాయి కొబ్బరి నర్సరీపై విచారించాలి : చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే
విజయరాయి కొబ్బరి నర్సరీ ద్వారా పంపిణీ చేసిన మొక్కలు విత్తనం నాసిరకంగా ఉండడం వల్ల రైతులు నష్టపోయారు. దీనిపై వీసీకి ఫిర్యాదు చేశా. సక్రమంగా విచారణ జర గలేదు. వీసీ వచ్చినప్పుడు హార్టికల్చర్ డీడీ హాజరు కాలేదు. దీనిసై సమగ్ర విచారణ చేయాలి. పెదవేగిలో పలు గ్రామాల్లో 22ఏలో నిషేధిత భూముల కింద లోతట్టు ప్రాంతాలను చేర్చారు. ఇందులో అవకతవకలు జరిగాయి. దోషులను విచారించి న్యాయం చేయాలి.
ఇళ్ల లబ్దిదారులకు న్యాయం చేయాలి : పత్సమట్ల ధర్మరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే
2014–19 కాలంలో ఇళ్లు మంజూరై నిర్మాణం మధ్యలో ఆగిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు చేయలేదు. వాటిని పూర్తి చేయాలి. పెదనిండ్రకొలనులో ఇళ్లస్థలాలు మంజూరు చేసి, తర్వాత రద్దు చేశారు. వారిలో అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయాలి.
జన్‌మన్ ఇళ్లు పూర్తి చేయాలి: చిర్రి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే
బుట్టాయగూడెం మండలం మోదెల గ్రామంలో అటవీశాఖ అధికారుల ఆంక్షల వల్ల పీఎం జన్‌మన్ పథకంలో గిరిజనులకు మంజూరైన 28 ఇళ్లు నిలిచిపోయాయి. వాటిని తక్షణం పూర్తి చేయాలి.
మౌలికసదుపాయాలు కల్పించాలి : బడేటి చంటి, ఏలూరు ఎమ్మెల్యే
ఏలూరు నగరంలో పేదలకు ఇచ్చిన ఇళ్లలో పట్టుమని వందలో ఐదుగురు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. ఈ దిశగా సౌకర్యాలు కల్పించాలి. రామకృష్ణాపురం, సత్రంపాడు తదితర ప్రాంతాల్లో కొన్ని స్థలాలను 22ఏ జాబితాలో చేర్చారు. ఈ సమస్యలపై స్పందించాలి.