జిల్లాలో అభివృద్ధి, విజన్ ప్లాన్ అమలు చేయాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:57 AM
జిల్లాలో అభివృద్ధి విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అమరావతి నుంచి సోమవారం రాష్ట్ర, జిల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి పర్చువల్‌గా విడుదల చేశారు.

ఏలూరు సిటీ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అభివృద్ధి విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అమరావతి నుంచి సోమవారం రాష్ట్ర, జిల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి పర్చువల్‌గా విడుదల చేశారు. అనం తరం కలెక్టరేట్‌లో అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి విజన్ ప్లాన్‌పై దిశా నిర్దేశం చేశారు. మొదటి సంవత్సరం 6 ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామికా భివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మంచి అవకాశాలున్నాయని, వనరులను వినియోగించుకుని అభివృద్ధి దిశగా జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటకులు బస చేసేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా జిల్లా, నియోజకవర్గ విజన్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. పీ4 కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు బంగారు కుటుంబాలు, మార్గదర్శకులను గుర్తించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి విశ్వేశ్వ రరావు, సీపీవో వాసుదేవరావు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లోని ముఖ్యప్రణాళికాధికారి కార్యాలయంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. స్వర్ణాంధ్ర విజన్–2047 యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా, నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్స్ రూపొం దించినట్లు తెలిపారు. యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా స్థాయి అధికారి నోడల్ అధికారిగా ఉంటారని, ఎమ్మెల్సీ, విద్యావేత్త, సంబంధిత టీమ్ సభ్యులు ఐదుగురితో కలిపి మొత్తం 9 మంది ఉంటారన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం..
పెదపాడు: ప్రతిభావంతులైన విద్యార్థులకు సత్కారం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ వారితో కలిసి భోజనం చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్, జేసీ ధాత్రిరెడ్డి కూడా పిల్లలతో కలసి భోజనం చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి కొద్దిసేపు విద్యార్థు లకు స్వయంగా వంటకాలను వడ్డించారు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పిల్లలకు సూచించారు. మంత్రి, అధికారు లతో భోజనం చేయడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.