యూరియా.. మితమే..హితం!
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:57 PM
అధిక దిగుబడులు ఆశించి ఎక్కువ శాతం రైతులు పరిమితికి మించి యూరియా వినియోగిస్తుండడం పట్ల శాస్త్ర వేత్తలు వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా.. మితమే..హితం!
చాట్రాయి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అధిక దిగుబడులు ఆశించి ఎక్కువ శాతం రైతులు పరిమితికి మించి యూరియా వినియోగిస్తుండడం పట్ల శాస్త్ర వేత్తలు వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి,మొక్కజొన్న,మిర్చి, కూరగాయలు మొదలెనౖ అన్ని పంటలకు వ్యవసాయాధికారులు సిఫార్సు చేసిన దానికంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ యూరియాను వినియోగిస్తున్నారని, దీని వల్ల నేలసారం దెబ్బతింటుందని, భూమి చౌడుగా మారుతుందని తెలిసినా రైతులు పట్టించుకోవడం లేదని వ్యవసాధికారులు అంటు న్నారు. సాగులో ఎక్కువగా కౌలు రైతులు ఉండడంతో అధిక దిగుబడులు కోసం యూరియా వినియోగిస్తున్నారు. యూరియా 50 కేజీల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.రెండు వేలు సబ్సిడీ భరించి రూ.266కే రైతులకు అంది స్తుండడం యూరియా అధిక వినియోగానికి ఒక కారణంగా చెబుతున్నారు. వరిలో కలుపుతీసిన తర్వాత 20 లేదా 40 రోజులకు యూరియా వాడాలి. కాని ఎరువులు వేసిన ప్రతిసారి యూరియా కలపడం పరిపాటి అయ్యింది. యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు పచ్చగా మొత్తగా మారి చీడపీడలు సోకే అవకాశం ఎక్కువ ఉందని, దీని నివారణకు ఎక్కువ పురుగుల మందులు వాడి పెట్టుబడి ఖర్చులు పెంచుకుంటున్నారని వ్యవసాయాధికారులు అంటున్నారు. మొక్కలకు కనీసం ఐదు సెంటీమీటర్ల దూరంలో యూరియా వేయాల్సి ఉండగా రైతులు అవగాహన లేక మొక్కల దగ్గర వేస్తున్నారు. యూరియా అధికంగా వాడడం వల్ల భూభౌతిక స్థితిలో మార్పు వచ్చి, నీటి నిల్వ సామర్థ్యం, ఎరువుల కరిగించుకుని మొక్కకు అందించే గుణం తగ్గుతుందని, పోషకాల సమతుల్యత దెబ్బతింటుందని రైతులు దిద్దుబాటు చర్యలు చేపట్టి నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
యూరియా అధిక వినియోగం వల్ల భూసారం దెబ్బతిని, మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి. యూరియా ఎక్కువ వేయడం వల్ల కాండం, ఆకు మెత్తబడి ముదురు ఆకు పచ్చగా వస్తే అధిక దిగుబడి వస్తుందనేది రైతుల అపోహ మాత్రమే. ఒక సర్వే ప్రకారం తెలంగాణ కంటే ఏపీలో 40 శాతం ఎక్కువ రసాయనిక ఎరువులు వాడుతున్నారు. నానో యూరియా కూడా బాగా పని చేస్తున్నదని శాస్తవేత్తల పరిశోధనలో తేల్చారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడడం ద్వారా 25 శాతం ఎరువులు ఆదా చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయం విధానం అనుసరిస్తే వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటికి ఎక్కువ మంది రైతులు డీలర్ల సలహాలు పాటిస్తూ రసాయనిక ఎరువులు పురుగుల మందులు యథేచ్ఛగా వినియోగిస్తుండడం ఆందోళనకరం. దీనిపై రైతుల్లో అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
– జి.విద్యాసాగర్, ఏడీఏ, వ్యవసాయశాఖ, నూజివీడు