నరసాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయండి
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:38 AM
నరసాపురం పట్టణాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జేఏసీ కోరింది.
కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన జేఏసీ నాయకులు
భీమవరం టౌన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నరసాపురం పట్టణాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జేఏసీ కోరింది. నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ నెక్కంటి సుబ్బారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరు రామరాజు, తదితరులు మంగళవారం భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్ నాగరాణిని కలిసి వినతిపత్రం అంద జేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల మనోభావాలు పట్టించుకోకుం డా ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. జిల్లా నలుమూలల జిల్లా ప్రధాన కార్యాలయాలకు వచ్చే వచ్చే ప్రజలు, ఉద్యోగులకు నరసాపురం సౌకర్యంగా ఉంటుందన్నారు. నరసాపురం పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలకు అను కూలమైన అనేక భవనాలు ఉన్నాయని, ఇంకా అవసరమైన భవనాలకు పట్టణంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
వ్యతిరేకం కాదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
నరసాపురం జిల్లా కేంద్రం కావడానికి తాను వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. ఈ ప్రతిపాదన తన ముందుకు వచ్చినపు డు జిల్లాకు వచ్చే బృందానికి చెబుతానని ఆయన స్పష్టం చేశారు. అఖిల పక్ష నాయకులు వర్మను కలసి వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వర్మతో మాట్లాడారు. నరసాపురం పూర్వం నుంచి రెవెన్యూ డివిజన్‌గా ఉందన్నారు. జిల్లా విభజన సమయంలో చాలాచోట్ల రెవెన్యూ డివిజన్లను, పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలు చేశారన్నారు. వర్మ మాట్లాడుతూ జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నం దున జిల్లా ఏర్పాటుకు సంబంధించి కమిటీ వచ్చినపుడు చెబుతానని అన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి, నెక్కంటి సుబ్బారావు, పొత్తూరి రామరాజు, కోటిపల్లి వెంకటేశ్వరారవు, వలవల నాని, పోలిశెట్టి నళిని, పోలిశెట్టి శ్రీనివాస్, జక్కం శ్రీమన్నారాయణ, నెక్కంటి క్రాంతి, వసంతరావు, అఖిలపక్ష నాయకులు ఉన్నారు.
నరసాపురం నుంచి జేఏసీ భారీ ర్యాలీ
నరసాపురం టౌన్: నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి భీమవరం ర్యాలీగా బయలుదేరారు. కార్లకు ఎమ్మెల్యే, విప్ నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కన్వీనర్ నెక్కంటి సుబ్బారావు జెండా ఊపారు. పట్టణంలోని ప్రధాన వీధుల నుంచి ర్యాలీ భీమవరం వెళ్లింది.