Share News

ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:59 AM

యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి నియోజక వర్గంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ

జిల్లా విజన్‌ సమీక్షలో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌

భూమి సేకరించండి

యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయండి

పరిశ్రమల స్థాపనకు చర్యలు

వనరులు సద్వినియోగం చేసుకోవాలి

అధికారులకు మంత్రి దిశానిర్దేశం

ఏలూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి నియోజక వర్గంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎం ఈ) ఏర్పాటుకు అనువుగా ప్రతీ నియోజకవర్గంలో 50 నుంచి 100 ఎకరాల భూమిని గుర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లో జిల్లా, నియోజకవర్గాల విజన్‌ యాక్షన్‌ప్లాన్‌పై మంగళవా రం ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా, నియోజకవర్గాలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏటా 15 శాతం వృద్ధిరేటు లక్ష్యం సాధించేలా చర్యలు చేపట్టా లన్నారు. వచ్చే సమావేశం నాటికి విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ తుది ప్రణాళికను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.

నూతన పారిశ్రామిక విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని అమరావతి, ప్రధాన నగరం విజయవాడ ఏలూరుకు చేరువలో ఉండడం, జాతీయ రహదారి, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు ఆక్వా, ఉద్యానరంగాల్లో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనతో జిల్లాలో స్థూల ఉత్పత్తిని రెట్టింపు చేసేలా వివిధ శాఖలు అధికారులు సమన్వయం తో పనిచేయాలి. జిల్లాలో స్థూల ఉత్పత్తి రూ.72,314 కోట్లు కాగా, అందులో 60 శాతం వ్యవసాయం, 35 శాతం ఆక్వా, 19 శాతం ఉద్యానవనాల నుంచి వస్తోందని మంత్రి వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని మంత్రి నాదెండ్ల ఆదేశించారు.

100 ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్లు

జిల్లాలో 100 ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకు 27 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. నూజివీడులో భారీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. మిగిలినవి నిర్దేశిత సమయంలో ఏర్పాటు చేస్తామని మంత్రికి వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్య లేదని, పరిశ్రమల స్థాపనకు అనుకూలమని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ అన్నారు.

పర్యాటక ప్రాంతంగా కొల్లేరు : ఎంపీ

దేశంలో 50 ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. జిల్లాలో కొల్లేరు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపా దన ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్‌, సొంగా రోషన్‌కుమార్‌, మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడారు. సమావేశంలో జేసీ ధాత్రిరెడ్డి, డీఆర్వో వి విశ్వేశ్వరరావు, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోలు స్మరణ్‌రాజ్‌, రమణ, అంబరీష్‌, విజయవాడ ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, నియోజకవర్గాల ప్రత్యేకాఽధికారులు పాల్గొన్నారు.

మెగా పామాయిల్‌ ప్లాంటేషన్‌

దెందులూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): పామాయిల్‌ పంటలను ప్రోత్సహించేందుకు మెగా ప్లాంటేషన్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సీతంపేట పసు మర్తి మధుబాబు వ్యవసాయ క్షేత్రంలో కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలి సి మంగళవారం పామాయిల్‌ మొక్కలను నాటా రు. కూటమి ప్రభుత్వం పామాయిల్‌ రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. జిల్లాలో 19 లక్షల పామాయిల్‌ మొక్కలు సిద్ధంగా ఉన్నాయ న్నారు. పామాయిల్‌ గెలలు కోయడానికి ప్లాస్టిక్‌ పనిముట్లు అందించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరడంతో మంత్రి స్పందించి జిల్లాలోనే ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ చేయిస్తామన్నారు. సొసైటీ అధ్యక్షుడు యలమర్తి శ్రీను, రెడ్డి అప్పల నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు చినబాబు, ఘంటశాల వెంకటలక్ష్మి, ఉద్యనవన శాఖ డీడీ ఎస్‌.రామ్మోహనరావు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 12:59 AM