మెరుగైన వైద్య సేవలందించండి
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:29 AM
పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏలూరు ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం బుధవారం జరిగింది. చైర్‌పర్సన్ కలెక్టర్ వెట్రిసెల్వి, ఎంపీ మహేశ్ సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి జిల్లా ఆసుపత్రికి అత్యవసర పరిస్థితిలో రోగులు వస్తుంటారని, వారికి వెంటనే చికిత్స అందేలా వైద్యసిబ్బంది పనిచేయాలన్నారు. వైద్య సేవల లోపం కారణంగా ఎటువంటి మరణం సంభవించకుండా డాక్టర్లు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. సదరం శిబిరంలో నమోదు చేసుకున్న వారికి వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మె ల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి మాట్లాడుతూ ప్రసూతి విభాగంలో పడకలు పెంచాలని, అత్యవసర సమయంలో రోగులను విజయవాడకు తరలిం చేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో లేవన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అల్ర్టాసౌండ్ స్కానింగ్, గుండె జబ్బులకు 2డీ ఎకో స్కానింగ్ చేసేందుకు డాక్టర్లు అందుబాటులో లేరని, రేడియాలజిస్ట్ పోస్టు భర్తీ చేయాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్, డీసీహెచ్‌ఎస్ పాల్ సతీష్, డీఎం హెచ్‌వో డాక్టర్ మాలిని, జిల్లా ఆసుపత్రి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.