డిజిటల్ బోధనలో క్లిక్కర్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:42 PM
తరగతి గది డిజిటల్ బోధనలో భాగంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి పాఠ్యాంశాలపై టీచర్లు అడిగే ప్రశ్నలకు బాల బాలికలు జవాబులిచ్చేందుకు క్లిక్కర్ డివైజ్‌లను పంపిణీ చేసింది.
జిల్లాలో రెండు జడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకు అందజేత
ఏలూరు అర్బన్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):తరగతి గది డిజిటల్ బోధనలో భాగంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి పాఠ్యాంశాలపై టీచర్లు అడిగే ప్రశ్నలకు బాల బాలికలు జవాబులిచ్చేందుకు క్లిక్కర్ డివైజ్‌లను పంపిణీ చేసింది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లాలో ఎంపిక చేసిన కొవ్వలి, ధర్మాజీగూడెం జడ్పీ హైస్కూళ్లకు మొత్తం 80 డివైజ్‌లను సమగ్ర శిక్ష జిల్లా అధికారులు శుక్రవారం అందజేశారు. మెగా పీటీఎం సందర్భంగా లాంఛనప్రాయంగా వీటిని విద్యార్థులకు పంపిణీ చేసి, ప్రశ్నలకు వ్యక్తిగతంగా జవాబులిచ్చే విధానాన్ని పరిశీలించారు. క్లిక్కర్ పరికరాల ప్రత్యేకత, వినియోగంపై సమగ్రశిక్ష జిల్లా సహాయ గణాంకాధికారి ఆర్.రామకృష్ణ మాట్లాడు తూ ప్రభుత్వం పాఠశాలలకిచ్చిన ఐఎఫ్‌పీ ప్యానెళ్ల ద్వారా డిజిటల్ విధానంలో ఇప్పటికే పాఠ్యాంశాల బోధన జరుగుతోందన్నారు. 9వ తరగతి పాఠ్యాంశాలను టైంటేబుల్ ప్రకారం బోధించిన అనంతరం పాఠ్యాంశంపై విద్యార్థులకు ప్రశ్నలను సంధించి, వాటికి వ్యక్తిగతంగా జవాబులను రాబట్టడం ద్వారా అభ్యసనా సామర్థ్యా లు, అవగాహన తెలుసుకోవడానికి క్లిక్కర్ డివైజ్‌లను ఉద్దేశించారన్నారు. విద్యా ర్థు లు ఇచ్చిన జవాబులు ఐఎఫ్‌పీ ప్యానెల్‌పై డిస్‌ప్లే అవుతాయన్నారు. ఈ విధా నం విజయవంతమైతే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్‌పీ ప్యానెళ్లువున్న అన్ని పాఠశాలలు, తరగతులకు విస్తరించే అవకాశం ఉందన్నారు. సమగ్రశిక్ష ఏఎల్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు, సీఎంవో డి.యెహోషువ, విలీనవిద్య కో–ఆర్డినేటర్ భాస్కరరాజు, జీసీడీవో బి.నవీన, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.