జాతీయ రహదారి నిర్మాణానికి పెరిగిన అంచనా
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:33 AM
జిల్లాలో ఆకివీడు – దిగమర్రు జాతీయ రహదారి నిర్మాణం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కానుంది.
దిగమర్రు–ఆకివీడు రహదారి నిర్మాణానికి
కేంద్రం సానుకూలం
అలైన్‌మెంట్ మార్పుతో పెరిగిన వ్యయం
కొత్త అంచనాల రూపకల్పన
జిల్లాలో ఆకివీడు – దిగమర్రు జాతీయ రహదారి నిర్మాణం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కానుంది. గతంలో రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రహదారి నిర్మాణంలో మార్పులు చేయడం, నాలుగు లేన్లకు విస్తరణకు జిల్లాలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నారు. దీనితో మరో అంచనా వ్యయం మరో వంద కోట్లు పెరగడంతో మొత్తంగా అంచనా రూ.2500 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు. కేంద్రం ఆమోద ముద్ర వేయడంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలకంగా వ్యవహరించారు. త్వరలో టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఆకివీడు–దిగమర్రు జాతీయ రహదారి ప్రాజెక్ట్ వ్యయ అంచనాలు పెరుగుతున్నాయి. కొత్త ధరలతో మళ్లీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు. ఆకివీడు నుంచి దిగమర్రు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.2400 కోట్లు వ్యయం కానుందని అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ఆకివీడు, కాళ్ల, భీమవరం రూరల్ మండలాల మీదుగా కొత్త అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పాలకొల్లు వద్ద ఆర్‌వోబి నిర్మించాల్సి ఉంది. అక్కడ ఏడు మీటర్లు ఎత్తు ఉండేలా ప్రతిపాదించారు. కొత్త నిబంధనల ప్రకారం 8 మీటర్లు ఎత్తు ఉండాలని కేంద్రం దిశా నిర్దేశం చేసింది. దానిని సరిదిద్ది కొత్త డీపీఆర్ పంపారు. ధరల పెరుగుదలతో సిమెంట్, స్టీలు, మెడల్, లేబర్ చార్జీలను బేరీజు వేసుకుని కొత్త అంచనాలు రూపొందిస్తున్నారు.
రూ.100 కోట్లు అదనం
జాతీయ రహదారి అధికారులు కొత్త అంచనాల్లో నిమగ్నమయ్యారు. గతంలో రూ.2400 కోట్ల అంచనా కు మరో రూ.100 కోట్లు పెరిగే అవకాశం ఉంది 165 జాతీయ రహదారి రెండో ఫేజ్‌లో ఆకివీడు–దిగమ ర్రు వరకు రూ.2500 కోట్లు వ్యయం కానుందని జాతీయ రహదారి అధికారులు అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లో కొత్త డీపీఆర్ కేంద్రానికి పంపను న్నారు. క్యాబినెట్‌లో ఆమోదం లభిస్తే టెండర్లు పిలవనున్నారు. రానున్న మార్చిలోపు టెండర్లకు ఆమోదం లేకుంటే జాతీయ రహదారి ప్రతిపాదన తిరిగి మొదటికొస్తుంది. తొలుత రెండు లేన్ల రహదారి ఏర్పాటు ప్రణాళిక కాగా జిల్లాలో ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేసి నాలుగు లేన్ల విస్తరణకు కేంద్రాన్ని ఒప్పించారు. దీనిలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ కీలకంగా వ్యవహరించారు. కొత్త డీపీ ఆర్ ఆమోదంపై వర్మ దృష్టి పెడతారని అధికారులు ధీమాతో ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగు ణంగా నివేదికలో మార్పులు చేసి పంపుతున్నారు.