Share News

పత్తి రైతుకు కష్టకాలం!

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:07 AM

పత్తి రైతాంగాన్ని కష్టాలు చుట్టు ముట్టాయి. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు కూలీల కొరత, గిట్టు బాటు ధర లేకపోవడంతో మూడేళ్లుగా రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు.

పత్తి రైతుకు కష్టకాలం!
కూలీల కొరతతో పొలంలోనే ఉండిపోయిన పత్తి

గిట్టుబాటు ధరలేక నిరాశ

కుక్కునూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పత్తి రైతాంగాన్ని కష్టాలు చుట్టు ముట్టాయి. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు కూలీల కొరత, గిట్టు బాటు ధర లేకపోవడంతో మూడేళ్లుగా రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. కుక్కునూరు, వేలేరు పాడు మండలాల్లో ఈ ఏడాది దాదాపు ఐదువేల ఎకరాల్లో పత్తి సాగైంది. సాగు కాలం ఆరంభం నుంచి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో తెగుళ్లు,చ పత్తికాయ నల్లగా మారడం, పూత, పిందె రాలి పోవ డం, కాసిన పత్తి నేల రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పంటను కాపాడుకోవడానికి రైతాం గం తీవ్రంగా శ్రమించారు. తీరా దిగుబడి వచ్చేసరికి కుదేలయ్యారు. ఎకరానికి 10 – 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం ఎకరానికి ఐదు క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోంది. ఇదే సమయంలో అక్టోబరులో తుపాన్‌ కారణంగా పత్తి నల్లబారడంతో పాటు పుచ్చు ఏర్పడింది. ఈ కారణంగా ధర తగ్గింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం జంగా రెడ్డిగూడెంలో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.8110 మద్దతు ధర ప్రకటించింది. అయితే కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకుని పత్తి అమ్మకాలు చేసుకోవాలి. రైతులకు ఈ యాప్‌పై అవగాహన లేక స్థానికంగానే పండిన పత్తి అమ్ముకుంటూ నష్ట పోతున్నారు.

ప్రస్తుతం కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. అందరికి ఒకేసారి పత్తి తీతలు రావడంతో కూలీల సమస్య ఏర్పడింది. రోజు రూ.300 కూలి చెల్లిస్తున్న క్రమంలో రైతు పై తీవ్రంగా ఆర్థికభారం పడుతోంది. క్వింటా పత్తితీతకు రూ.2వేలు పైగా ఖర్చవుతోందని పెట్టు బడులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మూడేళ్లుగా పత్తి రైతులు కాలం కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ప్రస్తుతం మళ్లీ ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఏర్పడింది మరోవైపు తుఫాన్‌ భయం వెంటాడు తోంది. ఇప్పటికే పంటచేలో ఉన్న పత్తిని పూర్తిగా తియ్యలేదు. వర్షం పడితే పత్తి తడిచి ధర ఇంకా పతనం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 01:08 AM