డయాలసిస్.. కష్టాలు తీరాయి!
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:34 AM
కైకలూరు నియోజకవర్గంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు, వారికి అందించే డయాలసిస్ కేంద్రాలు గతంలో అందుబాటులో లేక ఇబ్బందులు పడేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కైకలూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
ప్రతినెలా 35 మందికి వైద్యసేవలు
రోగులకు టీడీపీ ప్రభుత్వం భరోసా
కైకలూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సమాజంలో అత్యధిక ప్రజలు తాగే నీరు, తినే తిండి విచ్చలవిడిగా మందులు వినియోగం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇలా వ్యాధులకు గురైన వారు వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు, వారికి అందించే డయాలసిస్ కేంద్రాలు గతంలో అందుబాటులో లేక ఇబ్బందులు పడేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు, వైద్యాధి కారులు, టెక్నీషియన్, ఇతర సిబ్బందిని నియమించడంతో పాటు అన్ని రకాల వసతులను కల్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ చొరవతో ప్రతీ నెలా 35 మందికి డయా లసిస్ చేస్తున్నారు. మొత్తంగా నెలలో 300 సార్లు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. రోగికి రక్తాన్ని శుద్ధి చేసి మరలా ఎక్కించడంతో వారు ఆరోగ్యవంతంగా ఉంటారు. రోగి వ్యాధి తీవ్రతను బట్టీ వారికి రక్తాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. గతంలో ఇలా డయాలసిస్ కేంద్రం అందుబాటులో లేక రోగులంతా ఏలూరు, విజయవాడ, భీమవరం, మచిలీపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారు. ఎప్పటి నుంచో కైకలూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండడం, అందుకు ప్రభుత్వం చేయూతనివ్వడంతో స్థానికంగానే ఈ వైద్య సేవలు అందుతున్నాయి.
ప్రతీరోజూ రెండు బ్యాచ్‌లుగా..
ప్రతీరోజూ రెండు బ్యాచ్‌లుగా పది మంది కిడ్నీ బాధితు లకు రక్తాన్ని శుద్ధి చేసే సౌకర్యాలను కల్పించారు. స్థానికంగా ఉండే వైద్యాధికారితో పాటు పాలకొల్లు నుంచి మూత్రపిండాల వ్యాధి నిపుణులు ప్రతీ నెలా రెండు సార్లు రోగులను పరీక్షించి వారికి కావాల్సిన మందులను, రక్తాన్ని ఎన్నిసార్లు శుద్ధి చేయా లనేది నిర్ధారణ చేస్తుంటారు. ఒక్కొక్క డయాలసిస్‌కు ప్రభు త్వం రూ.1,244 ఖర్చు చేస్తోంది. ఇదే వైద్యాన్ని ప్రైవేటు ఆస్పత్రిలో పొందితే రూ.మూడు వేల నుంచి రూ.4 వేలు అయ్యేదని రోగులు పేర్కొంటున్నారు. ప్రతీరోజూ డయాలసిస్ పేషంట్లతో పాటు కైకలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు శ్రీసత్యసాయి సేవాసమితి ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. మరోవైపు అర్హత కలిగిన కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పెన్షన్ మొత్తం ఒక్కొక్క రోగికి రూ.7 వేలు మాత్రమే అందేది.
రోగులు పెరిగితే మరిన్ని సౌకర్యాలు
కైకలూరు ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ కేంద్రంలో రోగుల సంఖ్య పెరిగితే డయాలసిస్ మెషీన్ల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే ఉన్న ఐదు బెడ్లు, మిషన్లు ద్వారా రోగులకు రెండు దశల్లో డయాలసిస్ అందిస్తున్నం దున రోగుల సంఖ్య పెరిగితే మరో నాలుగు బెడ్లు, మిషన్లు ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
ప్రయాణభారం, వైద్య ఖర్చులు తగ్గాయి
ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ వారానికి రెండుసార్లు విజయ వాడకి వెళ్లి డయాలసిస్ చేయించుకునే వాడిని. కైకలూరులో ఏర్పాటు చేయడంతో ప్రయాణభారం తగ్గడంతో పాటు సొమ్ము ఆదా అవుతోంది. మానసిక ఒత్తిడి లేకుండా ఉంటున్నాం. విజయవాడ వెళితే అర్ధరాత్రికి తిరిగివచ్చేవాళ్లం. టీడీపీ ప్రభుత్వం కైకలూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది.
– పరసా వెంకయ్య, అయ్యవారిరుద్రవరం, మండవల్లి మండలం