పెట్రోలు బంకులతో జైళ్లశాఖ బలోపేతం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:32 AM
పెట్రోలు బంకుల నిర్వహణ వల్ల జైళ్లశాఖ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, తద్వారా ఆదాయ వనరులను సమకూరుస్తున్నామని రాష్ట్ర జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అంజనీకుమార్ యాదవ్ అన్నారు.
జైళ్లశాఖ డీజీపీ అంజనీకుమార్ యాదవ్
కైకలూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి):పెట్రోలు బంకుల నిర్వహణ వల్ల జైళ్లశాఖ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, తద్వారా ఆదాయ వనరులను సమకూరుస్తున్నామని రాష్ట్ర జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అంజనీకుమార్ యాదవ్ అన్నారు. గురువారం కైకలూరు సబ్‌జైల్ ప్రాంగణం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్‌పీ పెట్రోలు బంకును ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 పెట్రోలు బంకులను జైళ్ల శాఖ ద్వారా ఏర్పాటు చేశామని వీటిని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు బంకుల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. ఖైదీల్లో నైపుణ్యాభివృద్ధి పెరుగు తుందని సమాజసేవ కేంద్రాలుగా మార్చేందుకు దోహదపడుతుం దన్నారు. జైళ్లలో ఖైదీల శిక్షాకాలంలో ఇలాంటి వాటిపై నైపుణ్యత సాధించి సమాజంలో తిరిగి కలిసిపోవడానికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమాలలో జైళ్లశాఖపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందని, పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా సంస్కరణాత్మక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు బలపడతాయన్నారు.
అనంతరం రూ.1.90 కోట్లతో నిర్మాణం చేసే కైకలూరు సబ్‌జైలును పరిశీలించారు. పనుల నిర్వహణలో కాంట్రాక్టరు టైల్స్ వేయకుండా ఫ్లోరింగ్ చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో జైళ్ళల్లో కూడా మార్పులు తీసుకువచ్చామని ఫ్లోరింగ్ అంతా టైల్స్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. గుంటూరు రేంజ్ జైళ్లశాఖ డీజీపీ డాక్టర్ వరప్రసాద్, విజయవాడ సబ్‌జైల్ అధికారి ఎన్.శివశంకర్, ఏలూరుజిల్లా జైల్ సూపరింటెండెంట్ స్వామి, మచిలీపట్నం జిల్లా జైల్ సూపరింటెడెంట్ పిల్లా రమేష్, కృష్ణాజిల్లా సబ్‌జైల్ అధికారి ఉమామహేశ్వరరావు, కైకలూరు సబ్‌జైల్ సూపరింటెండెంట్ బొత్స అప్పారావు పాల్గొన్నారు.