Share News

నిర్మలమ్మ పెద్ద మనసు

ABN , Publish Date - May 15 , 2025 | 01:11 AM

పెదమైనవాని లంక మారుమూల గ్రామం. సముద్రం ఒడ్డున ఉన్న కుగ్రామంలో 1500 జనాభా. వారిలో 99 శాతం మత్స్యకార కుటుంబాలే. పదేళ్ల క్రితం వరకు ఈ గ్రామం ఆభివృద్ధికి ఆమడదూరంలో ఉంది.

నిర్మలమ్మ పెద్ద మనసు
పీఎం లంకలో సముద్రపు కోత

కోట్లాది రూపాయలతో దత్తత గ్రామం పీఎం లంక అభివృద్ధి

రూ.22 కోట్లతో డిజిటల్‌ సెంటర్‌, వంతెనల నిర్మాణం

కార్పొరేట్‌ సంస్థల నుంచి రూ.16 కోట్లతో మరిన్ని పనులు

నరసాపురం, మే 14 (ఆంధ్రజ్యోతి): పెదమైనవాని లంక మారుమూల గ్రామం. సముద్రం ఒడ్డున ఉన్న కుగ్రామంలో 1500 జనాభా. వారిలో 99 శాతం మత్స్యకార కుటుంబాలే. పదేళ్ల క్రితం వరకు ఈ గ్రామం ఆభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. దాదాపు రూ.22 కోట్లతో కేంద్ర మంత్రి అభివృద్ధి చేశారు. తాజాగా కార్పొరేట్‌ సంస్థల నుంచి రూ.16 కోట్లు మంజూరు చేయించారు.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నుంచి రూ.2.50 కోట్లు

ఇటీవల నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నుంచి పలు ఆభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి రూ.2.50 కోట్లు మంజూరు చేయించారు. స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వంద ఇళ్లపై సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.75.61 లక్షలు ఖర్చు చేయనున్నారు. దీంతో పాటు గ్రామంలో లైబ్రరీ భవనం, వాటర్‌ ప్లాంట్‌, మరుగుదొడ్లు, వినాయక ఆలయంలో కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.40 లక్షలు, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి రూ.25 లక్షలు, జడ్పీ స్కూల్‌ ప్రాంగణంలో ఆడి టోరియం, గోడ నిర్మాణానికి రూ.20 లక్షలు, మూడు మహిళ సమైక్య భవనాల నిర్మాణాలకు రూ.30లక్షలు, గ్రామంలో బీటీ రహదారి నిర్మాణానికి రూ.40లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.20లక్షల చొప్పున విడుదల చేశారు. ఇప్పటికేఈ పనులకు టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది.

సముద్ర కోత నివారణకు రూ 13.5 కోట్లతో రక్షణ గోడ

పీఎంలంకను సముద్ర కోత వెంటాడుతోంది. ఒక్కప్పుడు ఈ గ్రామం సముద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేది. ప్రస్తుతం ఆర కిలోమీటర్‌ దూరానికి వచ్చింది. గ్రామం సముద్ర గర్భంలో కలిసి పోతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో కోత నివారణకు చర్యలు చేపట్టారు. చెన్నై ఐఐటీ నిపుణులతో సర్వే చేయించారు. కార్పొరేట్‌ సంస్థ డెలైట్‌ నుంచి రూ 13.5 కోట్లు మంజూరు చేయించారు. సంస్థ సామాజిక సేవా కార్యక్ర మంలో భాగంగా తొలి విడత కోతకు గురవుతున్న చోట కిలోమీటర్‌ మేర గోడ నిర్మాణం చేపట్టనుంది. ఈ పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఆక్రమణలు కూడా తొలగించి త్వరలో పనులు చేపట్టన్నారు.

కేంద్ర మంత్రి అభిమానం మరువలేం

కేంద్ర మంత్రి మా గ్రామంపై చూపుతున్న అభిమానాన్ని మరవలేం. గ్రామస్తులు అడిగితే అభివృద్ధికి నిధులు ఇస్తున్నారు. రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మరో 13 కోట్లతో సముద్రపు కోత నివారణ పనులు చేపడుతున్నారు.

తిరుమాని సుబ్బు, పీఎంలంక

Updated Date - May 15 , 2025 | 01:11 AM