Share News

డేంజర్‌లో డిగ్రీ !

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:42 AM

జిల్లాలోని పేరు మోసిన ఓ డిగ్రీ కళాశాలలలో 15 ఏళ్ల క్రితం రెండు వేలకుపైగా విద్యార్థులు చదివేవారు. అక్కడ సీటు కావాలంటే మంచి మా ర్కులు రావాలి. లేదంటే రికమం డేషన్‌ ఉండాలి.

డేంజర్‌లో డిగ్రీ !

విద్యార్థులు రాక కళాశాలలు విలవిల

సంప్రదాయ డిగ్రీల కంటే వృత్తి విద్యపైనే ఆసక్తి

ఉమ్మడి జిల్లాలో 82 కళాశాలల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు

నోటీసులు జారీ చేస్తున్న ఉన్నత విద్యా మండలి

ఇప్పటికి మొదలు కాని అడ్మిషన్లు.. ఆందోళనలో యాజమాన్యాలు

జిల్లాలోని పేరు మోసిన ఓ డిగ్రీ కళాశాలలలో 15 ఏళ్ల క్రితం రెండు వేలకుపైగా విద్యార్థులు చదివేవారు. అక్కడ సీటు కావాలంటే మంచి మా ర్కులు రావాలి. లేదంటే రికమం డేషన్‌ ఉండాలి. ఫీజు సంగతి సరేసరి. అంత డిమాండ్‌ వుండేది. కాని, ఇప్పు డా కళాశాలలో విద్యార్థుల సంఖ్య 500లోపే. అడ్మిషన్స్‌ కోసం విద్యార్థు లను ఆకర్షించేందుకు జాబ్‌మేళాలు, ప్రత్యేక క్యాంపెయిన్‌లు చేయాల్సిన పరిస్థితి. ఇదే పరిస్థితే ఉమ్మడి పశ్చిమ లో చాలా కాలేజీల్లో నెలకొంది.

(తాడేపల్లిగూడెం రూరల్‌–ఆంధ్రజ్యోతి):

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 25 శాతంకంటే తక్కువ అడ్మిషన్స్‌ వున్న కళాశాలలపై దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో పలు ఆంక్షలు విధించేందుకు ఆ తరహా కళాశాలల జాబితాను సిద్ధం చేసింది. వీటికి ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అందులో సూచించింది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటి అనుమతులపై స్పష్టత వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.55 లక్షల సీట్లు వుంటే ఇందులో 39 శాతం కూడా భర్తీ కావడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డిగ్రీ కళాశాలలు డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వృత్తి నైపుణ్య కోర్సుల వైపు మొగ్గు చూపడం, డిగ్రీ కోర్సులపై అయిష్టత వ్యక్తం చేయడంతో డిగ్రీ చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. ఆచార్య నన్నయ్య యూనివర్శిటీ పరిఽధిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 208 కళాశాలలు ఉన్నాయి. వీటిలో అత్యధిక కళాశాలల్లో అడ్మిషన్స్‌లు లేక విలవిల్లాడుతున్నాయి. వీటి నిర్వాహకులు, యాజమాన్యాలు అడ్మిషన్స్‌ కోసం ఆశగా ఎదురుచూడటం, క్యాంపెయిన్లు, జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికి ఆశించినంత ఫలితాలు ఉండడం లేదు.

డేంజర్‌లో 82 కళాశాలలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 208 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 82 కళాశాలల్లో ఏదో ఒక కోర్సులో కాని, మొత్తం కోర్సుల్లో 25 శాతంకంటే తక్కువ అడ్మిషన్స్‌ ఉన్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. 25శాతం కంటే తక్కువగా అడ్మిషన్స్‌ ఉన్న కళాశాలల అనుమతి రద్దు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తరుణంలో నిర్వాహకులు అడ్మిషన్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది అడ్మిషన్స్‌ ఇంకా మొదలు కాకపోవడంతో కళాశాలల అనుమతులు పొందాలంటే ఆయా కోర్సుల్లో 25 శాతం మంది విద్యార్థులు చేరాల్సిన పరిస్థితి. డిగ్రీ చదవాలనుకున్న వారు ఎక్కువగా ఇంటర్‌ తర్వాత ఇతర వృత్తులు నేర్చుకుంటూ వేరేచోట జీతానికి పనిచేస్తూ దూరవిద్య ద్వారా డిగ్రీ చదివేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో చాలా డిగ్రీ కళాశాలలు రెగ్యలర్‌ డిగ్రీతోపాటు దూర విద్యా కోర్సులకు వారి కళాశాలల్లో అడ్మిషన్స్‌ తీసుకుంటున్నారు. వాటి ద్వారా ఏటా దూరవిద్యలో రెండు వేలకు పైగా విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు. మరోవైపు జూన్‌ నెల ముగుస్తున్నా.. ఇప్పటికీ అడ్మిషన్లు మొదలు కాకపోవడంపైన ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆ రెండు గ్రూపులకే డిమాండ్‌..

బీఏ, బీకాం, బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్‌, బీఎస్సీ కంప్యూటర్స్‌, బీఏ హిస్టరీ వంటి 70 వరకూ బ్రాంచిలు ఉన్నాయి. అన్నింటిలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, బీకాం కంప్యూటర్స్‌ కోర్సులకే అధిక డిమాండ్‌ ఉంది. మిగిలిన బ్రాంచిల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రాకపోవడంతో వాటికి ప్రాధాన్యత సన్నగిల్లింది. ఆ కోర్సులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున మూడేళ్లకు రూ.60 వేలు ఖర్చవుతోంది.

ఇతర కోర్సుల వైపే మొగ్గు

తమ పిల్లలు మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడాలని అనుకునేవారు ఎక్కువగా ఇంజనీరింగ్‌, వృత్తి నైపుణ్య కోర్సులవైపే ఆకర్షితులవుతున్నారు. ఇంటర్‌లో సీఈసీ వంటి కోర్సులు తీసుకుని, ఇతర వృత్తి నైపుణ్య కోర్సుల్లో చేరేందుకు అవకాశం లేని విద్యార్థులే డిగ్రీలో చేరుతున్నారు. దీంతో ప్లస్‌ 2 తర్వాత ఆర్ట్స్‌ చదివే వారు కనిపించడం లేదు. ఒకవేల అలాంటి వారు ఉన్నా చులకనగా చూసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో డిగ్రీ కళాశాలలు అడ్మిషన్స్‌ లేక వెలవెలపోతున్నాయి.

ఇది ఇబ్బందికరమైన విషయమే

విద్య వ్యాపారమైన సమయంలో ఈ తరహా ఆంక్షలు కోర్సుల ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుంది. గతంలో డిగ్రీ కోర్సులకు ఉండే క్రేజ్‌ ఇంతా అంతా కాదు. ఈ తరహా నిబంధనలు పెట్టడం సమంజసం కాదు. ప్రభుత్వం డిగ్రీ కోర్సుల ప్రాధాన్యత పెంచే విధంగా చేస్తే బాగుంటుంది. గతంలో ఏ యూనివర్శిటీ పరిధిలో కళాశాలలైనా వరుసగా మూడేళ్లపాటు జీరో అడ్మిషన్స్‌ ఉంటే వాటి అనుమతులు రద్దయ్యేవి. కానీ ప్రస్తుతం ప్రభుత్వ జీవో ప్రకారం 25 శాతంకంటే తక్కువ అడ్మిషన్స్‌ ఉండే కళాశాలల, గ్రూపుల రద్దు కోసం నోటీసులు ఇస్తాననడం సర్వత్రా కళాశాలల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి.

– మద్దాల రామకృష్ణ, వైఎస్‌ఆర్‌, బీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌, తాడేపల్లిగూడెం

Updated Date - Jun 27 , 2025 | 12:42 AM