Share News

యంత్రంలో పడి కూలీ మృతి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:44 AM

గడ్డి కోసే యంత్రంలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

 యంత్రంలో పడి కూలీ మృతి

పెదవేగి, మార్చి 10(ఆంధ్రజ్యోతి) : గడ్డి కోసే యంత్రంలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు యంత్రంలో పడిన ఆ వ్యక్తి శరీరం అతి చిన్న చిన్న ముక్కలుగా మారి, శరీరం ఆనవాళ్ళే లేకుండా పోయింది. రోజు కూలీతో పొట్ట నింపుకునే ఆ కుటుంబానికి తీరని వ్యధను మిగిల్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పెదవేగి మం డలం నడిపల్లి సమీపంలోని ప్రసాద్‌ సీడ్స్‌ (మొక్కజొన్న ఫ్యాక్టరీ)లో సోమవారం రాత్రి ఈ విషాదకర సంఘటన జరిగింది. బాపిరాజు గూడెం ఫ్యాక్టరీకి సమీపంలోని బాపిరాజుగూడెం గ్రామానికి చెందిన సింగపాము రవీంద్ర మొక్కజొన్న ఫ్యాక్టరీలో కూలిపనికి వెళ్తున్నాడు. అతని భార్య విజేత ధర్మాజీగూడెంలో ఉన్న దీనికి సంబంధించిన ఫ్యాక్టరీలోకి పనికి వెళ్తుంది. ఆ ఇద్దరు కూలిపని చేస్తూ 7, 9 ఏళ్ళ వయస్సు ఉన్న ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటు న్నారు. కాగా సోమవారం సాయంత్రం భార్య విజేత ధర్మాజీగూడెం ఫ్యాక్టరీకి వెళ్ళగా, రవీంద్ర నడిపల్లి సమీపంలోని ఫ్యాక్టరీకి పనికి వెళ్ళారు. అక్కడ పశువులకు సంబంధించిన మేత (సైలేజ్‌)ను తయారు చేసే యంత్రం దగ్గర రవీంద్ర పనిచేస్తున్నాడు. యంత్రం దగ్గర పని చేస్తున్న రవీంద్ర రాత్రి 7గంటల సమయంలో ప్రమాదవశాత్తు అదే యంత్రంలో పడిపోయా డు. ఈ ప్రమాదంలో మొక్కజొన్న చొప్ప (దంట్లు)తోపాటు రవీంద్ర(35) శరీరం సేకరించ డానికి కూడా వీల్లేని విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యింది. సమాచారం అందుకున్న పెదవేగి ఎస్‌ఐ కె.రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. భర్త మృతి సమాచారం తెలుసుకున్న భార్య విజేత ప్రమాద స్థలానికి చేరుకుని, రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది.

Updated Date - Mar 11 , 2025 | 12:44 AM