Share News

డీసీసీబీని లాభాల బాట పట్టిస్తాం

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:58 PM

వైసీపీ హయాంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును రూ.100 కోట్ల పైబడి నష్టాల్లోకి నెట్టేశారు.. మేము ఇప్పటికే ఆ నష్టాలను రూ.70 కోట్లకు తగ్గించాం.

డీసీసీబీని లాభాల బాట పట్టిస్తాం
డీసీఎంఎస్‌ మహాజన సభలో మాట్లాడుతున్న ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు

ఆప్కాబ్‌,డీసీసీబీ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు

ఏలూరులో డీసీఎంఎస్‌ మహాజన సభ

ఏలూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును రూ.100 కోట్ల పైబడి నష్టాల్లోకి నెట్టేశారు.. మేము ఇప్పటికే ఆ నష్టాలను రూ.70 కోట్లకు తగ్గించాం. 2027 నాటికి డీసీసీబీని లాభాలబాట పటిస్తామని ఆప్కాబ్‌, డీసీసీబీ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు స్పష్టం చేశారు. డీసీఎంఎస్‌ జిల్లా మహాజన సభ చైర్మన్‌ చాగంటి మురళీకృష్ణ అధ్యక్షతన గురువారం జరిగింది. గన్ని ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.1 లక్ష 40 వేల కోట్ల టర్నోవర్‌తో ఆప్కాబ్‌ స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థగా నడుస్తోందని, త్వరలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద మొండి బకాయిల వసూళ్లకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో సొసైటీల కంప్యూటరీకరణ, సంస్కరణల ఫలితంగా దేశంలో ఉత్తమ ప్రతిభకు రెండో స్థానంలో సిమ్లాలో అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 13 డీసీసీబీలకు వెయ్యి కోట్లు బంగారు రుణాల అందజేతకు చర్యలు చేపట్టామన్నారు. వడ్డీ శాతం తగ్గించి సభ్యులకు రుణాలను అందిస్తామన్నారు. డీసీఎంస్‌కు గోడౌన్ల నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారు. దీపావళి బాణసంచా అమ్మకాల ద్వారా సొసైటీలు లాభాలను ఆర్జించాలని సూచించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ మాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ డీసీఎంఎస్‌ రూ.2.79 కోట్ల నికర లాభాలను సాధించిందని, ఇందులో రూ.34 లక్షల సొసైటీలకు డివిడెండ్లుగా ఇస్తామన్నారు. రాబోయే కాలంలో రూ.200 కోట్ల వ్యాపారం చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ప్రైవేట్‌ డీలర్లకు దీటుగా కాంప్లెక్స్‌, ఇతర ఎరువులను కూడా సరసమైన ధరలకు 21 బ్రాంచిల ద్వారా అందిస్తామని చెప్పారు.

వ్యాపారాలు విస్తరించాలి..

డీసీఎంఎస్‌ ద్వారా మండలంలో వ్యాపారాలు విస్తరించాలని, ఎరువులు ప్రైవేట్‌ డీలర్లు అందించే ధరలకు బ్రాంచ్‌ల ద్వారా సరఫరా చేయాలని, మిశ్రమ ఎరువులను సిద్ధంగా ఉంచాలని. త్రిసభ్య కమిటీ చైర్మన్లు తాతా సత్యనారాయణ తదితరులు కోరారు. సమావేశంలో డీసీవో ఆరిమిల్లి శ్రీనివాస్‌, ఏలూరు డీఆర్‌ సత్యవతి, ఇతర సొసైటీల చైర్మన్లు కరాటం ఉమామహేశ్వరరావు, కుటుంబశాస్ర్తి, కొత్తపల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:58 PM