Share News

సహకార బదిలీలపై కసరత్తు

ABN , Publish Date - May 25 , 2025 | 12:24 AM

సహకార శాఖలో బదిలీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల నియామకం జరిగి పది రోజులవుతోంది. వీరి నియామకాలకు సంబంధించి అధికారికంగా జీవోలు రావాల్సి ఉంది.

సహకార బదిలీలపై కసరత్తు

ఉమ్మడి జిల్లాలోని 34 బ్రాంచిల్లో సుమారు 1,450 మందికి తప్పని స్థానచలనం

సహకార శాఖలో బదిలీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల నియామకం జరిగి పది రోజులవుతోంది. వీరి నియామకాలకు సంబంధించి అధికారికంగా జీవోలు రావాల్సి ఉంది. మరోవైపు సహకార ఉద్యోగుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. జూన్‌ రెండో తేదీలోగా బదిలీల ప్రక్రియ ముగించాల్సి ఉంది. ఆ తర్వాత బదిలీలపై మూడో తేదీ నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈలోగా కోరుకున్న చోటుకు బదిలీ ఎలా చేయించుకోవాలన్న దానిపై ఉద్యోగుల, సిబ్బంది తర్జన భర్జనలు పడుతున్నారు.

ఏలూరు, మే 24 (ఆంధ్రజ్యోతి) :

గతేడాది సంవత్సరం మధ్యలో బదిలీల వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతాయని రాష్ట్ర కో–ఆపరేటివ్‌ సొసైటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అభ్యంతరం తెలిపింది. దానికి తోడు మరోవైపు అప్పుడే జిల్లాలో సొసైటీల కంప్యూటరీకరణ చేయడంతో ప్రభుత్వం బదిలీల నుంచి సహకారశాఖకు మినహాయింపు ఇచ్చింది. అప్పట్లో ఒకేచోట రెండేళ్లు సర్వీస్‌ పూర్తయిన వారు ఉన్నారు. డీసీసీబీ 34 బ్రాంచిల పరిధిలో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో 250 సెక్రటరీలు, 1,200 మంది సిబ్బందికి ఈసారి బదిలీ ఖాయంగా కనిపిస్తోంది. గతేడాదికి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి వీరంతా ప్రవేశించడంతో మూడు ఆప్షన్ల ప్రాతిపదికన వారు కోరుకున్న చోటకు బదిలీలు చేసేందుకు డీసీసీబీ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

సెక్రటరీలకు స్థానచలనం

వ్యాపార లావాదేవీల ఆధారంగా నాలుగు కేటగిరీల కింద పీఏసీఎస్‌ల సెక్రటరీలను విభజించారు. వీరం దరికి హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తున్నందున సుదీర్ఘంగా ఒకేచోట ఏళ్ల తరబడి సెక్రటరీలుగా పనిచేస్తున్న వారికి ఈసారి బదిలీ తప్పనిసరిగా మారింది. ఆరు జిల్లాలకు సంబంధించి గుంటూరులోని రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కో–ఆపరేటివ్‌ కార్యాలయం పరిధిలో బదిలీల కసరత్తు జరుగుతోంది. డీఎల్‌ఏసీ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో జిల్లాలో ఎంత మంది స్థానచలనం ఉంటుందో ఈనెలాఖరుకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జిల్లా సహకారశాఖ అధికారి పరిధిలో అసిస్టెంట్‌, డివిజనల్‌, ఇతర విభాగాల్లోని రిజిస్ర్టార్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. వీరంతా కలిసి 45 మంది ఉంటారని అంచనా.

Updated Date - May 25 , 2025 | 12:24 AM