దసరా శోభ
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:29 AM
ఉమ్మడి జిల్లాలో దేవీ నవరాత్రుల ఉత్సవాలకు అమ్మ వారి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు
భీమవరం టౌన్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో దేవీ నవరాత్రుల ఉత్సవాలకు అమ్మ వారి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది తిథి ద్వయం రావడంతో 11 రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవార్లను కూడా 11 అవతారాలలో దర్శనమిస్తారు.
భీమవరం మావుళ్లమ్మ ఆలయం వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి అలంకారాలు చేయనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పంచారామ క్షేత్రమైన గునుపూడిలోని సోమేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేయనున్నారు. భీమేశ్వరస్వామి ఆలయంలోను మహిషాసుర మర్ధిని అమ్మవారికి, గునుపూడి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయంలోను ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటితోపాటుగా పాలకొల్లులో పంచారామ క్షేత్రమైన క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం, దువ్వ దానేశ్వరి, పెనుగొండ వాసవీ కన్యకా పరమేశ్వరి, పెంటపాడు బైరాగిమఠం, ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ, పెదవేగి రాట్నాలమ్మ, తాడేపల్లిగూడెం వనుమలమ్మ తదితర ప్రముఖ దేవాలయాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
వైభవంగా అమ్మవారి శోభాయాత్ర
మావుళ్లమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. వందలాది మంది మహిళలు కలశాలు చేతబట్టుకుని అమ్మవారి నామస్మరణ చేస్తుండగా వేద మంత్రాలతో శోభాయాత్ర ప్రారంభమైంది. ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన యాత్ర పురవీధుల మీదుగా సాగింది. దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ది మహాలక్ష్మి నగేష్, ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ పర్యవేక్షించారు. తిరిగి ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. వందలాది మంది మహిళలు తరలిరావడంతో అమ్మవారి ఆలయం వద్ద ఒక రోజు ముందుగానే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా కనిపించింది.
భవానీ దీక్షలు ప్రారంభం
దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి భక్తులు నవరాత్రుల్లో భవానీ మాలలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో భవానీ పీఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎర్రని దుస్తులు ధరించి నియమ నిష్ఠలతో పూజ మొదలెడుతున్నారు.