Share News

డేంజర్‌ స్పాట్‌

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:11 AM

జాతీయ రహదారి.. రాష్ట్రీయ రహదారి.. గ్రామీణ రహదారి మార్గం ఏదైనా ప్రమాదకర మలుపు ఉంటుంది. తరచు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

డేంజర్‌ స్పాట్‌
జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపు

జాతీయ, ప్రధాన రహదారులపై ప్రమాదకర మలుపులు

జాతీయ రహదారి.. రాష్ట్రీయ రహదారి.. గ్రామీణ రహదారి మార్గం ఏదైనా ప్రమాదకర మలుపు ఉంటుంది. తరచు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నివారణ చర్యలు మాత్రం శూన్యం. స్పీడ్‌ బ్రేకర్లు, హెచ్చరిక, సూచికలు కానీ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రధానంగా తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రాలను కలిపే జీలుగుమిల్లి – కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు విస్తరించినా ప్రమాదకర మలుపులు, ఎగుడు దిగుడు మార్గంలో వేగంగా రాకపోకలు సాగించే భారీ వాహనాలతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి.

జంగారెడ్డిగూడెం రూరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలను కలుపుతూ నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి (516డి) అత్యంత ప్రమాదకరంగా మారింది. రహదారి వెంబడి పట్టణా లు, గ్రామాల ప్రధాన కూడళ్లలో మృత్యువు కబళిస్తోంది. తెలంగాణ నుంచి జీలుగుమిల్లి మీదుగా జంగారెడ్డిగూడెం వరకు కూడా మూడు, నాలుగు డెత్‌ స్పాట్‌లను పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అనేక ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు. జాతీయ రహదారిపై దేవరపల్లి, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం నిత్యం వేలాది లారీలు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.

ముఖ్యంగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి, వేగవరం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జంగారెడ్డిగూ డెం–బుట్టాయిగూడెం రహదారి, జాతీయ రహదారి నాలుగు రోడ్ల కూడలి లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ పెట్రోల్‌ బంక్‌లతో పాటు డాబాలు, హోటల్స్‌, మద్యం దుకాణాలు ఉండడంతో జాతీయ రహదారి పక్కనే భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాం తం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలోకి రాకపోకలు సాగించే వాహ నాలు ఈ రహదారిని క్రాస్‌ చేయాల్సి ఉంది. రోడ్డు పక్కనే నిలిపిన భారీ వాహనాల కారణంగా కూడలి వద్ద వాహనాలు సరిగ్గా కనపడకపోవడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.

రహదారి అభివృద్ధి చేసినా..!

జీలుగుమిల్లి: జాతీయ రహదారి విస్తరణ చేపట్టినా ప్రమాద సూచికలు లేకపోవడం, కొన్ని చోట్ల రహదారి ఎగుడు దిగుడుగా ఉండడం తో వాహనాల నియంత్రణ చేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్‌లు గుర్తించినా అక్కడ రోడ్డు పై రేడియం స్టిక్కర్లు కానీ, ప్రమాద సూచికలు కానీ లేవు. మరికొన్ని చోట్ల మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగతున్నాయి.

జీలుగుమిల్లి మండలంలో నెల రోజుల్లో సుమారు 12 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై 6 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అధికారుల దృష్టికి రానివి, ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్లినవి ఎన్నో..!

కొయ్యలగూడెం.. నిత్యం ప్రమాదాలే!

కొయ్యలగూడెం: జంగారెడ్డిగూడెం–కొయ్యలగూడెం మధ్య జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. 13 కిలోమీటర్ల రహదా రిలో బయ్యన్నగూడెం పులివాగు వంతెన, కొయ్యలగూడెం బీసీ కాలనీ, నర్సన్నపాలెం వై.జంక్షన్‌ వద్ద తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. ఖమ్మం నుంచి విశాఖ వాహనాలు ఎక్కువగా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ట్రాఫిక్‌ ఎక్కువై తరచూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు, ప్రజలు కోరుతున్నారు.

అమ్మో.. జూబిలీ నగర్‌ మలుపు

లింగపాలెం: చింతలపూడి–లింగపాలెం రహదారిపై జూబిలీనగర్‌ వద్ద మలుపు ప్రమాదకరంగా మారింది. డివైడర్‌, స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడంతో వాహనాల వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల ఆటోలు, ద్విచక్ర వాహనదారులు అనేక మంది గాయపడ్డారు. ఈ నెల 3న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్‌ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. యడవల్లి– యర్రంపల్లి మధ్య మలుపులో సూచిక బోర్డులు లేకపోవడంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated Date - Nov 05 , 2025 | 12:11 AM