Share News

నడకతోనే ఆరోగ్యం

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:25 AM

ప్రస్తుత సమాజంలో చిన్నాపెద్ద, ధనిక పేద ఎవరి నోట విన్నా వ్యాయామం అనే మాట వినిపిస్తుంది. శారీక వ్యాయామం తగ్గిన నేటి పరిస్థితుల్లో పౌరులు నడక, వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. వ్యాయామం, యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గ్రహించారు.

నడకతోనే ఆరోగ్యం

వ్యాయామంపై పెరిగిన ఆసక్తి

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో 80 వ్యాయామ శాలలు... 1.50 లక్షల మంది వాకర్స్‌

ప్రస్తుత సమాజంలో చిన్నాపెద్ద, ధనిక పేద ఎవరి నోట విన్నా వ్యాయామం అనే మాట వినిపిస్తుంది. శారీక వ్యాయామం తగ్గిన నేటి పరిస్థితుల్లో పౌరులు నడక, వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. వ్యాయామం, యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గ్రహించారు. ఆసక్తి పెరిగింది. ఉదయం వాకింగ్‌ చేసే వారి సంఖ్య, జిమ్‌లకు వెళ్లి వ్యాయామం చేసే వారి సంఖ్య పెరిగింది. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

పాలకొల్లు, జూలై 12(ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం సుమారుగా 80 వ్యాయామశాలలు ఉన్నాయి. లక్షా 50వేల మంది ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రోజూ నడుస్తున్నారు. జిల్లాలో 80 వాకర్స్‌ క్లబ్‌లు ఉండగా వేల సంఖ్యలో వాకర్స్‌ నిత్యం నడుస్తూ పలువురిని నడిపిస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలకు వెనక్కి వెళితే కార్మిక కర్షక వర్గాలతో పాటు 50శాతం పైబడి పౌరులకు శారీరక శ్రమ ఉండేది, పేద మధ్య తరగతి వర్గాలలో 90శాతం పైబడి పురుషులు సైకిళ్లు తొక్కేవారు. ఇంటి పట్టున ఉండే మహిళలు బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం, అంట్లుతోమడం, ఇంటికి చాకిరీ చేసుకుంటూ శరీరానికి తగినంత పని కల్పించే వారు.. నేడు ఇంటి వద్ద ఉండే మహిళలకు శారీరక శ్రమ లేకుండా కట్టెల పొయ్యి స్థానంలో గ్యాస్‌ స్టవ్‌లు వచ్చేశాయి. రుబ్బురోలుతో పనిలేకుండా మిక్సీలు, గ్రైండర్లు అందుబాటులో ఉన్నాయి. బట్టలు ఉతికేందుకు వాషింగ్‌ మిషన్లు, చివరకు ఇంటిలో చీపురు అవసరం లేకుండా వాక్యూం మిషన్లు, సంప్రదాయ ఆహారం స్థానంలో ఫాస్ట్‌, జింక్‌ ఫుడ్‌లు ఇలా దైనందిన జీవితంలో అన్నింటా మార్పులు రావడంతో ఊబకాయాలు పెరగడమే కాకుండా బిపీ, షుగర్‌ వంటి రోగాల బారిన పడుతున్నారు. ఇప్పుడు కూలీలుపని చేసుకునే కార్మికవర్గాలు సైతం బైక్‌ లేనిదే కాలు బయట పెట్టడం లేదు. కాలినడక, సైక్లింగ్‌ పూర్తిగా మర్చిపోయారు పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు బైక్‌లు స్కూటీలు వాడుతుంటే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు కార్లు వాడుతున్నారు ఈ పరిస్థితుల్లో వ్యాయామం లేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈవిధంగా రోగాల బారిన పడుతున్నవారికి సమతుల్య ఆహారం అందిస్తామంటూ కొన్ని ఆహార కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. వాటి వల్ల ఉపయోగం ఉందో లేదో కానీ, సొమ్ములు దండీగానేలాగేస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఇప్పుడు సుమారు 42 లక్షల మంది జనాభా ఉండగా అందులో సుమారు 2 లక్షల మంది మైదాన ప్రాంతాలు, రహదారులు వెంబడి పార్కులలోనూ వాకింగ్‌ చేస్తుండగా సుమారు 2 లక్షల మంది మహిళలు ఇంటివద్దనే ఉంటూ తేలికపాటి నడకవంటి వ్యాయామాలు చేస్తున్నారు. ఇప్కుడు పలు వ్యాయామ శాలలో పౌరుల వయస్సును బట్టి వ్యాయామ శిక్షణ అందిస్తున్నారు. నిత్యం 30 నిమిషాలు తక్కువ కాకుండా వ్యాయామం చేస్తే శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గడమేకాకుండా స్థూల కాయం నియంత్రించడం బిపీ, షుగర్‌ వంటి వ్యాధులు అదుపులోకి రావడం, ముఖ్యంగా శరీర పటుత్వం పెరిగిన కంటి చూపు మెరుగు పడడం. ఆయువు పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని వ్యాయామ శాలల నిర్వాహకులు, వైద్యులు చెబుతున్నారు.

25 ఏళ్లుగా వ్యాయామం చేస్తున్నా..

గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా. దీని వల్ల ఏవిధమైన ఆనారోగ్య సమస్యలు తలెత్తలేదు. బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవు ఒకటి.. రెండుసార్లు తప్ప జ్వరం కూడా రాలేదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఫిట్నెస్‌తో పాటు మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది.

– గాదె వెంకన్న, ఆధ్యాత్మిక వేత్త, పాలకొల్ల్తు

వ్యాయామానికి ప్రాధాన్యం పెరిగింది

గత 16 ఏళ్లుగా జిమ్‌ కోచ్‌గా పనిచేస్తున్నా. 12 ఏళ్ల నుంచి సొంతంగా వారాహి జిమ్‌ పేరుతో జిమ్‌ నిర్వహిస్తున్నా. పురుషులతో పాటు, మహిళలు జిమ్‌కు వస్తున్నారు. రోజుకు స్ర్తీ, పురుషులతో కలిపి 150 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. యువత జిమ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

– మడ్డు వాసు, జిమ్‌ నిర్వాహకుడు, పాలకొల్లు

Updated Date - Jul 13 , 2025 | 12:25 AM