Share News

ముంచుకొస్తున్న మొంథా

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:54 AM

బంగా ళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈనెల 27న తీవ్ర తుఫాన్‌గా మారనుంది.

ముంచుకొస్తున్న మొంథా
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

అధికారులు, ప్రజలు అప్రమత్తం కావాలి : కలెక్టర్‌

వాతావరణ శాఖ హెచ్చరిక

పొంచి ఉన్న ముప్పు

రైతుల ఆందోళన

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌

ఏలూరు సిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): బంగా ళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈనెల 27న తీవ్ర తుఫాన్‌గా మారనుంది. మొంథాగా పిలిచే తుఫాన్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. మచిలీప ట్నం– కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గరిష్ఠంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు వరకు ఉంటుందని చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు

జిల్లాలో మొంథా తుఫాను ప్రభావం తీవ్ర స్థాయి లో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేప థ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తిచేశారు. కలెక్టరేట్‌లో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించి ముం దస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఈనెల 28, 29 తేదీలలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గాలుల కు హోర్డింగ్స్‌, స్థంభాలు, చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, పూరిళ్లు కూలిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. లోతట్టు ప్రాంతా ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల న్నారు. నదులు, చెరువుల్లోకి ఎవరూ ఈతకు వెళ్లకుండా, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. కొల్లేరు లంక ప్రాంతా ల్లోని ప్రజలను చేపల వేటకు వెళ్లరాదని సూచించాల న్నారు. సమాచార వ్యవస్థ స్తంభించకుండా టెలికాం టవర్ల వద్ద జనరేటర్లు సిద్ధం చేయాలన్నారు. వాటి ఏర్పాట్లను సంబంధిత మండల తహసీల్దార్లు తనిఖీ చేయాలన్నారు. తుఫాను ప్రమాదం తొలగే వరకు జిల్లాలో అధికారులు, సిబ్బంది ప్రధాన కార్యస్థానాల లో ఉండాలని, ప్రజలకు అవసరమైన సేవలందించా లన్నారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలన్నారు. లోతట్టు ప్రాంతాల లో ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను దగ్గరలోని పీహెచ్‌సీలకు తరలించాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వరద ఉధృతి ఎక్కు వగా ఉన్న కల్వర్టులు, కాజ్‌వేలు, వాగులను ప్రజలు దాటకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణాలు పోకుండా విద్యుత్‌ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులకు సెలవులు కట్‌

జిల్లాలో వరద తుఫాన్‌ ప్రమాదం ముగిసే వరకు అధికారులు, సిబ్బందికి సెలవులు మంజూరు చేయ డం జరగదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సెలవులో ఉన్న వారి సెలవు రద్దు చేశామని, వారు వెంటనే విధులకు హాజరు కావాలన్నారు.

సమీక్షలో జేసీ ఎంజె అభిషేక్‌ గౌడ, డీఆర్వో వి విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి విన్నూత్న, ఆర్డీవోలు అచ్యుత్‌ అంబరీష్‌, రమణ, సర్వే శాఖ ఏడీ అన్సారి, ఏలూరు నగరపాలకసంస్థ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌, జిల్లా వైద్యాధికారి పిజె అమృతం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్‌ శాఖ అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ శాఖ ఏలూరు, జంగారెడ్డిగూడెంలలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసిందని ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు తెలిపారు. విద్యుత్‌ సమస్యలు దగ్గరలోని విద్యుత్‌ శాఖాధికారులకు గాని 1912 నెంబర్‌కు గాని తెలియజేయాలన్నారు.

రైతుల ఆందోళన

మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో 9మండలాల్లోని 31 గ్రామాల్లో 1987 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ప్రస్తుతం జిల్లాలో వరి సాగు వివిధ దశల్లో ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల వరి చేలు నేలకొరిగితే నష్టం ఎక్కువగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అరటి, కూరగాయల సాగుతో పాటు మామిడి, జీడితోటలలో కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఏలూరులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

మొంథా తుపాను నేపథ్యంలో ఏలూరు జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కంట్రోల్‌రూమ్‌ నంబర్లు 9491041419, టోల్‌ఫ్రీ నంబర్‌ 18002331077 గా కలెక్టర్‌ ప్రకటించారు.

రేపు పీజీఆర్‌ఎస్‌ రద్దు

ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించడానికి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ రద్దు చేసిన ట్లు కలెక్టర్‌ ప్రకటించారు. తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో మార్పును ప్రజలు గమనించాలన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:54 AM