Share News

డిజిటల్‌ లక్ష్మి వస్తోంది

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:11 AM

మెప్మా సంస్థ ఆధ్వర్యంలో పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

డిజిటల్‌ లక్ష్మి వస్తోంది

మహిళలకు పౌర సేవల బాధ్యత

పట్టణాల్లో సీఎస్‌సీల ఏర్పాటు

జిల్లాలో 242 మంది గుర్తింపు

భీమవరం టౌన్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మెప్మా సంస్థ ఆధ్వర్యంలో పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలలో చదువుకున్న మహిళలను ఎంపికచేసి డిజిటల్‌ లక్ష్మి కామన్‌ సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 547 మందిని ఎంపిక చెయ్యలని నిర్ణయించగా ఇప్పటి వరకు 468 మందిని గుర్తించారు. పశ్చిమలో 304మందిని ఎంపిక లక్ష్యం కాగా ఇప్పటి వరకు 242 మందిని ఎంపిక చేశారు. నూరుశాతం పూర్తి చేయడానికి మెప్మా అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో డిజిటల్‌ లక్ష్మిలు సేవలందించనున్నారు.

స్వయం సహాయక సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి. 21నుంచి 40 ఏళ్లలోపు వయసు, డిగ్రీ చదివి, స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉండాలి. ఆధార్‌ స్థానిక అడ్రస్సుతో కలిగి ఉండాలి. దరఖాస్తులు పూర్తిస్థాయి పరిశీలన అనం తరం అర్హులను ఎంపిక చేస్తారు. ఈ సెం టర్ల ద్వారా దాదాపు 250 రకాల సేవలు అందించనున్నారు..

ఉమ్మడి జిల్లాలో 549 మంది ఎంపిక లక్ష్యం

ఉమ్ముడి పశ్చిమగోదావరి జిల్లాలో 549 మంది డిజిటల్‌ లక్ష్మిలను ఎంపిక చేయాల్సి ఉండగా 468 మందిని ఎంపిక చేశారు. ఇంకా 81 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. ఎంపిక బాధ్యత మెప్మా అధికారులకు అప్పగించారు.

రూ.2.5 లక్షల రుణం

ఎంపికైన డిజిటల్‌ లక్ష్మికి మెప్మా సంస్థ రూ.2.5 లక్షలు రుణం మంజూరు చేయిస్తారు. ఇందులో ల్యాప్‌టాప్‌, కియోస్క్‌, డివైజ్‌, ప్రింటర్‌, వంటివి అందజేస్తారు. ఈవీటి ద్వారా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా అందించే అన్ని సేవలను అందించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని పథకాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఈనెలలోనే ప్రారంభం?

డిజిటల్‌ లక్ష్మి కేంద్రాలు (సీఎస్‌సీ) ఈనెలలోనే ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాధికారిత దిశగా సాగేందుకు డిజిటల్‌ లక్ష్మి కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:11 AM