పంటలకు బీమా ధీమా
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:28 AM
వర్షాలు.. వరదలతో ఒడిదుడుకులతో సాగే ఈ సార్వా సాగుకు పంటల బీమా రైతుకు దీమా. ప్రభుత్వం పంటల బీమా రైతులకు అందుబాటులోకి తెచ్చింది.

ఎకరాకు రూ.42 వేలు బీమా సౌకర్యం
రైతు ప్రీమియం రూ.210
ఆగస్టు 15 వరకు గడువు
పంట ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
ఎంపిక చేసిన జిల్లాలకే పరిమితం
పశ్చిమ రైతులకు అవకాశం
ఐదేళ్లుగా బీమా సౌకర్యం లేదు
వర్షాలు.. వరదలతో ఒడిదుడుకులతో సాగే ఈ సార్వా సాగుకు పంటల బీమా రైతుకు దీమా. ప్రభుత్వం పంటల బీమా రైతులకు అందుబాటులోకి తెచ్చింది. చిన్న మొత్తంగా ప్రీమియం చెల్లించి పంట నష్టాన్ని బట్టి లబ్ధి పొందేలా సౌకర్యం వచ్చింది. ఇది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంటపై దీమాతో ఉండవచ్చు రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దానిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది.
భీమవరం రూరల్, జూలై 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు పంటల బీమా పథకం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎకరానికి రైతు రూ.210 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. రైతుకు మాత్రం ఎకరానికి రూ. 42 వేలు నష్టపరిహారంగా అందుతుంది. ప్రీమియం చెల్లింపునకు ఆగస్టు 15వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. ఎన్నడూ లేనివిధంగా పంటల బీమా అందుబాటులో రావడం రైతులకు సార్వా సాగులో ధీమాగా నిలిచే అవకాశం ఉంది.
సార్వాకు బీమా ఉండాల్సిందే
సార్వా సాగులో ప్రతి ఏడాది రైతులు ప్రకృతి దెబ్బకు పంట నష్టపోతూ వస్తున్నారు. 2023 సార్వా సాగులో 2 లక్షల ఎకరాలలో సాగు చేస్తే 70 వేల ఎకరాలు పంట చేతికందే సమయంలో పూర్తిగా దెబ్బతింది. మిగిలిన సాగు సగం దిగుబడే ఇచ్చింది. గత ఏడాది సార్వాలోను నారుమడులు, నాట్లు దశలో 30 వేల ఎకరాలు దెబ్బతింది. ప్రభుత్వ ఇన్‌పుట్ సబ్సిడీ అందించింది. గడిచిన ఐదేళ్లు లెక్క తీసుకున్నా ప్రతి పంట నష్టం చేస్తూనే వచ్చింది. దీంతో సాగుకు పంటల బీమా తప్పనిసరి అని రైతులు అనుకుంటున్నారు. పంట నష్టాన్ని బీమా సొమ్ము భర్తీ చేయడానికి వీలవుతుంది.
గడిచిన ఐదేళ్లు ధీమా లేదు..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా చెల్లింపులో తేడాల కారణంగా రైతులకు పంటల బీమా వర్తించలేదు. ఒక ఏడాది ప్రీమి యం చెల్లించవద్దని రైతులకు సూచించినా ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. ఆ పంటలోనే ప్రకృతి కారణంగా పంట భారీగా నష్టం ఏర్పడింది. దీంతో రైతులకు బీమా సొమ్ము రాలేదు.
ఇవి తప్పనిసరి
సార్వా పంటకు ప్రీమియం చెల్లించాలనుకునే రైతులు ఎకరాకు రూ. 210 చెల్లించాలి. వాటితోపాటు రైతు ఆధార్ కార్డు, పొలం పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్‌లు ఇవ్వాలి. దాంతోపాటు పంట వేసినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. రుణాలు పొందినవారు బ్యాంకులలో ఇవి ఇవ్వాలి. రుణం పొం దని రైతులు ఆర్‌ఎస్‌కే కేంద్రాలలో వ్యవసాయ సిబ్బందిని సంప్రదించవచ్చు.