Share News

రీసర్వేలో దిద్దుబాట

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:33 AM

జిల్లాలో మూడో విడత రీసర్వే ప్రారంభమైంది. వైసీపీ హయాంలో తలెత్తిన సమస్యలు లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

రీసర్వేలో దిద్దుబాట

300 మంది సిబ్బంది నియామకం

175 రోజులు గడువు

డాక్యుమెంట్‌లు సమర్పిస్తే ప్రత్యేక ఎల్‌పీ నంబర్‌ కేటాయింపు

వైసీపీ హయాంలో తప్పిదాలకు పరిష్కారం

6,590 జాయింట్‌ ఎల్‌పీ నంబర్‌లకు ఊరట

జిల్లాలో మూడో విడత రీసర్వే ప్రారంభమైంది. వైసీపీ హయాంలో తలెత్తిన సమస్యలు లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. తాజా సర్వేలో 22 గ్రామాలను ఎంపిక చేశారు. రైతుల సహకారంతో రెవెన్యూ భూములను సర్వే చేసేలా ప్రణాళిక చేశారు. 300 మంది సిబ్బందిని నియమించారు. ఒత్తిడి, హడావుడి లేకుండా సర్వే నిర్వహించేలా 175 రోజులు గడువు విధించారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వైసీపీ హయాంలో చేసిన తప్పిదాలను పున రావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కూటమి అధికారంంలోకి వచ్చిన తర్వాత తప్పులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తోంది. మూడో తేదీ నుంచి మూడో విడత రీసర్వే నిర్వహిస్తున్నారు. మూడు నెలల్లో క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేయాలి. మరో మూడు నెలల్లో వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ముందుగా రైతులకు నోటీసులు ద్వారా సర్వే విషయాన్ని తెలియపరిచాలి. రైతు సమక్షంలోనే సర్వే నిర్వహించాలి. కూటమి ప్రభుత్వం తొలినుంచి ఇదే పంథాను అనుసరిస్తోంది. ముఖ్యంగా ఆక్వా చెరువుల్లో హద్దులు లేకపోవడంతో భూమి అంతటికీ ఒకే ఎల్‌పీ నంబర్‌ ఇచ్చేశారు. దీనివల్ల రైతులు రుణాలు పొందకుండా పోయారు. భూమి అమ్ముకుందా మన్నా అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి తప్పిదాలకు కూటమి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. జాయింట్‌ ఎల్‌పీ నంబర్‌లు లేకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. హద్దులు లేకుండా భూములుంటే రైతులు దస్తావేజులు తేవాల్సి ఉంటుంది. దస్తావేజుల్లో ఉన్న భూమి వివరాలు, భూమి మొత్తం వివరాలకు సరిపోతే ప్రత్యేక ఎల్‌పీ నంబర్‌ కేటా యిస్తున్నారు. దస్తావేజు ఆధారంగా హద్దులను నిర్ణయిస్తూ ఎల్‌పీ నెంబర్‌ కేటాయిస్తుండడంతో రైతులకు ఎటువంటి సమస్య ఉండడం లేదు. అయితే రైతులు లేని పక్షంలో మాత్రం జాయింట్‌ ఎల్‌పీ నంబర్‌ ఇవ్వక తప్పడం లేదు. అక్కడ రైతులే ప్రత్యేక ఎల్‌పీ నంబర్‌కు దరఖాస్తు చేసుకోలేదంటూ రాస్తున్నారు.

విడతల వారీగా సర్వే

కూటమి ప్రభుత్వం రీసర్వేలో సకల జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికారంలోకి రాగానే మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. సర్వే పూర్తి చేసింది. సత్ఫలితాలు వచ్చాయి. దాని ఆధారంగా రెండో విడతలో 27 గ్రామాలను ఎంపిక చేశారు. సదరు గ్రామాల్లోనూ సర్వే సక్రమంగా పూర్తి చేశారు. తాజాగా జిల్లాలో మరో 22 గ్రామాలను ఎంపిక చేసి సర్వే ప్రారంభించారు.వీఆర్‌వోలు, సర్వేయర్‌లతో సహా తహసీల్దార్‌ సైతం సర్వేలో భాగస్వాములు కానున్నారు.

6,590 దరఖాస్తులు పరిష్కారం

వైఎఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ హయాంలో 32 వేల జాయింట్‌ ఎల్‌పీ నంబర్‌లు కేటాయించారు. వాటికి కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. ఈ ఏడాది 10,757 జాయింట్‌ ఎల్‌పీ నంబర్‌లను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్మంగా పెట్టుకుంది. అందులో 6,590 నంబర్‌లకు పరిష్కారం చూపారు. మరో 4,167 నెంబర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా వాటికి కూడా వేర్వేరు ఎల్‌పీ నంబర్‌లు ఇవ్వాలి. అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

మూడో విడత రీసర్వే గ్రామాలివే

భీమవరం రెవెన్యూ డివిజన్‌ : దుంపగడప, అనాకోడేరు, కోమర్రు, వల్లూరు, బొండాడ, ఉండి, వీరవాసరం

తాడేపల్లిగూడెం : పెదతాడేపల్లి, బి.కొండేపాడు, రేలంగి

నరసాపురం : లక్ష్మణేశ్వరం, పొలమూరు, చింతపర్రు, ఎస్‌.చిక్కాల, నేరేడుమిల్లి, యలమంచిలి, చినమల్లం, పెనుమంట్ర, ఓడూరు, పండితవిల్లూరు, గుమ్మలూరు, ఆచంట వేమవరం .

Updated Date - Oct 11 , 2025 | 01:33 AM