Share News

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:08 AM

విద్యా హక్కు చట్టం ద్వారా పేద విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరడానికి ప్రభుత్వం గడువు పొడిగించింది. మూడు విడతల ప్రవేశాలకు మొదటి విడత ప్రవే శాలకు ఈ నెల 7 వరకు నిర్ణయించారు.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

విద్యాహక్కు చట్టం మేరకు ప్రవేశాలు

ఈ నెల 10 వరకు పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి గడువు

జిల్లాలో 247 ప్రైవేట్‌ పాఠశాలలు

మొదటి విడత 912 సీట్ల కేటాయింపు

భీమవరం రూరల్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టం ద్వారా పేద విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరడానికి ప్రభుత్వం గడువు పొడిగించింది. మూడు విడతల ప్రవేశాలకు మొదటి విడత ప్రవే శాలకు ఈ నెల 7 వరకు నిర్ణయించారు. 7, 8 తేదీలు సెలవు రావడంతో ఈ నెల 10 వరకు గడువు పొడిగించారు. జిల్లాలో 399 ప్రైవేటు పాఠశాలలు ఉండగా విద్యాహక్కు చట్టం ప్రవేశాలకు 247 పాఠశాలలు అందుబాటులో ఉంచారు. మొదటి విడత 912 విద్యార్థుల ప్రవేశాలు ఇవ్వనున్నారు. గత ఏడా ది మూడు విడతలుగా కలిపి 1369 మంది విద్యార్థులు చేరారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడతలోనే 912 సీట్లు కేటాయించడంతో మిగిలిన రెండు విడతలలో పెరుగుతారని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోనే విద్యా హక్కు చట్టం ప్రవేశాలు ఎక్కువని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 2500 మంది విద్యార్థుల వరకు చేరేందుకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది

పేద విద్యార్థులు విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థు లు పాఠశాలలో అందుబాటులో ఉన్న తరగతి వరకు ఫీజు లేకుండా చదువుకోవచ్చు. అర్బన్‌ పరిధిలో రూ.8 వేలు, రూరల్‌ పరిధిలో రూ.7 వేలు, ఏజెన్సీ పరిధిలో రూ.50 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది.

కొన్ని పాఠశాలల్లో అడ్డంకులు

విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు కొన్ని పాఠశాలల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యా సంవత్సరం సగం, చివరి పరీక్షల సమయంలో ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు తల్లిదండ్రులను డిమాండ్‌ చేసేవారు. 2023–24 సంవత్సరంలో విద్యా హక్కు చట్టంలో చదువుతున్న విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖాధికారికి విన్నవించుకున్నారు. ఫీజుల విషయమై ప్రైవేట్‌ పాఠశాలలు అనుకూలంగా వ్యవహరించాలి.

Updated Date - Jun 09 , 2025 | 12:08 AM