Share News

ఎవరి స్థలం.. ఎవరికి రుణం !

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:49 PM

స్థలాల పేరిట.. రుణాల దందాతో జిల్లా సహకార బ్యాంకు పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది.

ఎవరి స్థలం.. ఎవరికి రుణం !

తాడేపల్లిగూడెంలోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.13 కోట్ల రుణం

మేనేజర్లు, సిబ్బందిపై నాటి వైసీపీ నేతల ఒత్తిడితో మంజూరు

రికవరీ లేక.. పీకల్లోతు నష్టాల్లో డీసీసీబీ.. వసూళ్లకు బోర్డు తీర్మానం

స్థలాల పేరిట.. రుణాల దందాతో జిల్లా సహకార బ్యాంకు పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది. జిల్లాలోని రెండు సహకార బ్యాంకు శాఖల్లో ఇళ్ల స్థలాల పేరిట రుణాలు మంజూరు చేశారు. ఒక్కో స్థలానికి రూ.2 లక్షలు చొప్పున సుమారు 650 మందికి ఇచ్చేశారు. అప్పటి నేతలు బ్యాంకు మేనేజర్లు, సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి తమ బంధువులు, స్నేహితుల పేరుతో రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లించలేదు. ఇలా తాడేపల్లిగూడెంలోని రెండు సహకార బ్యాంకుల్లో ఏకంగా రూ.13 కోట్లు రుణాలు ఇచ్చేశారు. రికవరీ చేయలేకపోయారు. వాయిదాలు చెల్లించాలంటూ రుణ గ్రహీతలకు నోటీసుల జారీతో అసలు భాగోతం బయటపడింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వివిధ రకాల రుణాలు రికవరీ కాకపోవ డంతో ఇప్పటికే జిల్లా సహకార బ్యాంకు రూ.100 కోట్ల లోటు బడ్జెట్‌కు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. లోటుకు గల కారణాలపై డీసీసీబీ బోర్డు దృష్టి పెట్టింది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ రెండు బ్రాంచ్‌ల్లో నిలిచిన రుణాలను రికవరీ చేయాలని దిశా నిర్దేశం చేసింది.

రంగంలోకి దిగనున్న సిబ్బంది

వాస్తవానికి క్షేత్రస్థాయిలో స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో పరిశీలించకుండానే రుణాలు ఇచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో సహకార బ్యాంకుల్లో వైసీపీ నేతల హవా నడిచింది. వారి సిఫారసుతోనే స్థలాలకు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరయ్యాయి. ఇతర ప్రాంతాల్లోని స్థలాలకు రుణాలు ఇచ్చిన ఘనత సహకార బ్యాంకులకు దక్కింది. తాజాగా రికవరీ కాని రుణాలకు మాత్రం స్థలాలు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రుణాలు పొందిన వారందరికి అప్పట్లో లబ్ధి చేకూరలేదు. వారి పేరు మార్చి రుణాలు తీసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో బ్యాంకుల నుంచి ఇదే తరహాలో రుణాలు తీసుకుని దందా సాగించారు. చివరకు రికవరీలు లేకపోవడంతో వాణిజ్య బ్యాంకులు తాజాగా రుణాలు మంజూరు చేయాలంటే ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇటువంటి దందాలతోనే సహకార బ్యాంకుకు నష్టాలు తెచ్చి పెట్టాయి. తాజాగా బోర్డు ఆదేశాలతో రికవరీ కోసం సిబ్బంది రంగంలోకి దిగనున్నారు. అప్పట్లో రుణాల కోసం తనఖా పెట్టిన దస్తావేజులకు, రుణాలు తీసుకున్న గ్రహీతలకు సంబంధం ఉందా ? లేదా ? అనేది తేల్చనున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:49 PM