కూలీలు కరువాయె!
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:30 AM
మొంఽథా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు భారీగా నష్టపోయారు. వ్యయప్రయాసలకు ఒర్చి మిగిలిన పంటను ఒబ్బిడి చేశారు. అయితే తీతకు వచ్చిన కాస్తా పంటను దక్కించుకుందామంటే ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది.
ఇప్పటికే మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులు
కనీసం పెట్టుబడులూ దక్కవంటూ ఆవేదన
ముసునూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మొంఽథా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు భారీగా నష్టపోయారు. వ్యయప్రయాసలకు ఒర్చి మిగిలిన పంటను ఒబ్బిడి చేశారు. అయితే తీతకు వచ్చిన కాస్తా పంటను దక్కించుకుందామంటే ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది. దీంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితుల్లో పత్తి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ముసు నూరు, చింతలవల్లి, బలివే తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో పత్తి పంట సాగు అయింది. మొంథా తుఫాన్ వల్ల కొంతమేర నష్టం వాటిల్లినా, ప్రస్తుతం మిగిలిన పంటతీతకు సిద్ధంగా ఉంది. తుఫాన్ వల్ల రబీ వ్యవసాయం అలస్యమైంది. మొక్కజొన్న విత్తనాలు పెట్టడం, నాటు పొగాకు నాట్లు వేయడంతో పాటు ఇతర వ్యవసాయ పనులు ఒకేసారి ప్రారంభం కావడంతో పత్తి తీతకు కూలీల కొరత ఏర్పడింది. పొలాల్లో తీతకు వచ్చిన పత్తి రాలిపోయి నేలపాలు అవుతుండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తుఫాన్ వల్ల ఈ ఏడాది దిగుబడులు తగ్గిన, ఉన్న పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రబీ వ్యవసాయ పనులు పూర్తయ్యే వరకు కూలీల కొరత తప్పదని, ఈ ఏడాది కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
పత్తి నేలరాలిపోతోంది
నేను రెండెకరాల్లో పత్తి పంట సాగు చేశాను. మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు కాయ దశలో ఉన్న పంటకు 50శాతం పైగా నష్టం వాటిల్లింది. మిగిలిన పత్తి తీతకు వచ్చిన సమయానికి కూలీల కొరత ఏర్పడింది. దీంతో పత్తి నేలరాలి పోతోంది. ఉన్న పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొంది.
– తలకొండ మధుసూదనరావు, రైతు, ముసునూరు.