కలెక్టరేట్.. ఏది.. రైట్!
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:33 AM
భీమవరంలో జిల్లా కలెక్టరేట్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కూటమిలో ఎవరికి వారే చాపకింద నీరులా కలెక్టరేట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికీ మనుగడలో ఉన్న ఉత్తర్వులు
20 ఎకరాల్లో నిర్మాణానికి గత ప్రభుత్వ ఆదేశం
అక్కడే మేలంటున్న కూటమిలో ఓ వర్గం
ఎమ్మెల్యే సైతం సానుకూలంగా ఉన్నారంటూ చర్చ
పెద అమిరంలో రెండున్నర ఎకరాల గుర్తింపు
అక్కడ నిర్మాణానికి మరో వర్గం అనుకూలత
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరంలో జిల్లా కలెక్టరేట్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కూటమిలో ఎవరికి వారే చాపకింద నీరులా కలెక్టరేట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పెదఅమిరం పరిధిలో అనుకూలంగా ఉంటుందని కూటమిలో ఒకవర్గం ప్రతిపాదించింది. సొంతంగా నిధులు సమీకరించి కలెక్టరేట్ నిర్మిస్తామంటూ ప్రభుత్వం వద్ద తమ అభిప్రాయాలను వెల్లడించింది. పెద అమిరంలో గుర్తించిన స్థలం భీమవరం పట్టణానికి ఆనుకుని ఉండడంతో అక్కడే మేలంటూ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో ప్రకటించారు. కనీసం పది ఎకరాలైనా ఉండాలంటూ ఎమ్మెల్యే అంజిబాబు చెపుతూ వస్తున్నారు. తాజాగా ఏఎంసీ స్థలంపై భీమవరంలో చర్చ జరుగుతోంది. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి ప్రకటించినప్పుడే అప్పటి కలెక్టర్ ప్రశాంతి స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలం కలెక్టరేట్‌కు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దానికి తగ్గట్టుగానే గత ప్రభుత్వం ఏఎంసీకి చెందిన 20 ఎకరాల భూమిని కలెక్టరేట్ కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికీ ఆ ఉత్తర్వులు మనుగడలో ఉన్నాయి. కలెక్టరేట్ ఎక్కడ నిర్మాణం చేపట్టినా ప్రజలకు రవాణా సౌకర్యం ఉండాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో భీమవరం పట్టణానికి రవాణా సదుపాయం ఉంది. పట్టణంలోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్‌కు వెళ్లడానికి కూడా రవాణా సౌకర్యం అత్యవసరం. బస్సులు, ఆటోలు పయనిస్తూ ఉండాలి. అటువంటి చోట కలెక్టరేట్ నిర్మిస్తే జిల్లా ప్రజలకు సానుకూలంగా ఉంటుంది. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్‌కు ఎంతోమంది కలెక్టరేట్‌కు వస్తున్నారు. ఇతర పనుల మీద నిత్యం వస్తూనే ఉంటారు.
భీమవరానికి బ్రాండ్‌గా కలెక్టరేట్
జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేకత ఉంది. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు ప్రజలందరి మదిలో భీమవరం మెదులుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అందు బాటులో ఉంది. ఆర్థికంగా సంపన్నమైన పట్టణం. ఆక్వా రాజధానిగా భీమవరం పట్టణాన్ని భావిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే కలెక్టరేట్ ఉండాలంటూ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా కార్యాలయాలు ఒకేచోట అందుబాటులో ఉండాలి. సువిశాలమైన పార్కింగ్ స్థలం అవసరం. పరేడ్ నిర్వహించడానికి అనువుగా తీర్చిదిద్దాలి. ఇటువంటి ప్రతిపాదనలతోనే కనీసం 10 ఎకరాలు ఉండాలంటూ ఎమ్మెల్యే అంజిబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆయన కూడా ఏఎంసీ స్థలం అయితే ఎలా ఉంటుందనే విషయమై ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో మనుగడలో ఉండడంతో పట్టణ ప్రజల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. మొత్తానికి జిల్లా కలెక్టరేట్ విషయమై భీమవరంతో పాటు, అన్ని నియోజకవర్గాల ప్రజల్లోనూ చర్చ నడుస్తోంది.