ఆహార పదార్థాలను వేడిగా, రుచిగా అందించాలి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:37 AM
అన్న క్యాంటీన్‌లో ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచి గా అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
అన్న క్యాంటీన్లు పరిశీలించిన కలెక్టర్ నాగరాణి
భీమవరం టౌన్, జూలై 23(ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్‌లో ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచి గా అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్లను బుధవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. భోజనం చేస్తున్న వారితో మాట్లాడి పదార్థాలు రుచిగా ఉన్నాయా? క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉంటున్నాయా? అని ప్రశ్నించారు. ఆహార పదార్థాలను కలెక్టర్ స్వయంగా రుచి చూశారు. అనంతరం 40 మంది పేదలకు చీరలు, దుప్పట్లు, లుంగీలు, టవల్స్ టూత్ పేస్టుల కిట్ పంపిణీ చేశారు. మునిసిపల్ డీఈ రెహమాన్, ఎంహెచ్‌వో సోమశేఖర్, వార్డు సచివాలయం కమ్యూనిటీ కార్యదర్శి మోహన్‌రావు, మహిళా పోలీస్ పుష్పరాణి, తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి
భీమవరం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడానికి అధి కారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. విద్యా శాఖ అధికారులు, టీచర్స్ యూనియన్ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో బుధవారం ఆమె సమీక్షించారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకుంటూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందన్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వివిధ సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను విభజించి ‘సంసిద్ధత కార్యక్రమం’ పేరిట ఉదయం, సాయంత్రం ఒక గంట అదనంగా తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరికలు తక్కువగా ఉన్నాయని, విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలన్నారు. జాతీయ విద్యా విధానంగా భాగంగా నిర్వహించిన ‘పరాక్’ సర్వేలో పశ్చిమ గోదావరి జిల్లా వెనుకబడి ఉండడంపై సంబంధిత అధికారుల, యూనియన్ నాయకులను కలెక్టర్ ప్రశ్నించారు. డీఈవో నారాయణ, ఏపీసీ శ్యాంసుందర్, ఏడీ సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.